Viveka Murder Case: అప్రూవర్ దస్తగిరికి భద్రత పెంపు

by srinivas |
Viveka Murder Case: అప్రూవర్ దస్తగిరికి భద్రత పెంపు
X

దిశ, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో అప్రూవల్‌గా మారిన దస్తగిరికి అదనపు భద్రత పెంచారు. ఇటీవల సీబీఐ విచారణ వేగవంతం చేయడం, వైఎస్ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయడం లాంటి పరిణామాల నేపథ్యంలో దస్తగిరి జిల్లా ఎస్పీకి అదనపు భద్రత కోసం విన్నవించుకున్నారు. బుధవారం కడపకు వచ్చి ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. వివేక హత్య కేసులో ఏ4 నిందితులుగా ఉన్న తనను కడప కోర్టు అప్రూవర్‌గా ఆమోదించిందని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇటీవల సీబీఐ విచారణ ముగింపు దశకు వస్తోందని, పులివెందులకు చెందిన వైఎస్ కుటుంబంలోని కొందరిని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. దీంతో పులివెందులలో వైసీపీకి చెందిన కొందరు తనపై కక్షగట్టారని, తన ఫ్యామిలీని ఏమైనా చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తనతో పాటు కుటుంబాన్ని అంతం చేయాలని చూస్తున్నట్లు విన్నవించారు.

సీబీఐ చట్టపరమైన చర్యలు జీర్ణించుకోలేని ఎంపీ అవినాష్ రెడ్డి తనపై రెచ్చగొట్టే విధంగా మీడియాలో ఆరోపణలు చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా ఎస్పీకి ఇచ్చిన వినతిపత్రంలో దస్తగిరి తెలిపారు. కావున తన కుటుంబానికి ప్రాణహాని లేకుండా ఉండేందుకు కడప ఎస్పీ తగిన చర్యలు తీసుకొని, భద్రత పెంచాలని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంతవరకు దస్తగిరికున్న వన్ ప్లస్ వన్ భద్రతకు తోడు ఇప్పుడు 5 ప్లస్ వన్ భద్రత పెంచారని సమాచారం. అయన ఇంటి వద్ద భద్రత కల్పించడంతోపాటు ఆయన ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఆయనతో వెళ్లే విధంగా ఈ భద్రత కల్పించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed