పవన్‌కు ఉన్న తిక్క పైత్యంగా మారింది.. రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు

by Javid Pasha |
పవన్‌కు ఉన్న తిక్క పైత్యంగా మారింది.. రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత వారాహి విజయ యాత్ర పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని వైసీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విమర్శించారు. ఈ వారాహి విజయ యాత్రలో పవన్ తన విధానాలను చెప్పుకోవాలి కానీ..ఇతరులను దూషించడం సరికాదని హితవు పలికారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్‌లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కు మామూలుగానే తిక్క ఉంటుందని.. అది కాస్త పైత్యంగా పరిణమించిందని అభిప్రాయపడ్డారు. రాజకీయాలలో నైతిక విలువలను పవన్ దిగజారుస్తున్నారని.. పదేపదే నోరుజారుతూ ప్రజాకోర్టులో దోషిగా నిలబడుతున్నారని విమర్శించారు. చివరకు సేవా దృక్పథంతో పనిచేస్తున్న వ్యవస్థను.. ఊడిగం చేసే వ్యవస్థగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కరోనా కల్లోల సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తే.. వారి త్యాగాలను కించపరచడం హేయమని మల్లాది విష్ణు మండిపడ్డారు. వలంటీర్లలో సుమారు 70 శాతం మంది మహిళలు ఉన్నారని.. వారి మనోభావాలు గాయపరిచే విధంగా జనసేన అధినేత ప్రసంగాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. జగనన్న సురక్ష క్యాంపులకు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న విశేష స్పందన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని మల్లాది విష్ణు ఆరోపించారు.

వలంటీర్ల వ్యవస్థపై తొలినుంచి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ విషం చిమ్ముతోందని.. అదే దారిలో వెళుతూ జనసేన అధినేత వాలంటీర్ వ్యవస్థపై ముప్పేట దాడి చేస్తున్నారని మండిపడ్డారు. పేదలను నవరత్నాల పథకాలకు అర్హులను చేసే క్రమంలో సేకరించే డేటాను.. సంఘవిద్రోహ శక్తులకు వాలంటీర్లు అందిస్తున్నారంటూ పవన్ మాట్లాడటం తగదన్నారు. ఏ ఆధారాలతో వాలంటీర్లపై ఆరోపణలు చేశారో జనసేన అధినేత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ వ్యాఖ్యలను కుల, మతాలకతీతంగా లక్షలాది మంది లబ్ధిదారులు చీత్కరించుకుంటున్నారని చెప్పారు. అయినా పవన్ మాటల్లో ఏకోశాన పశ్చాత్తాపం కనిపించడం లేదని.. పైగా ప్రశ్నిస్తున్న వారిపై ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. ముమ్మాటికీ చంద్రబాబు డైరక్షన్‌లో పవన్ ఈవిధంగా మాట్లాడుతున్నారని మల్లాది విష్ణు ఆరోపించారు. ఇప్పటికైనా పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వలంటీర్లకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజల ఆగ్రహజ్వాలలకు గురికాక తప్పదని వైసీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed