జగన్! నువ్వు దానకర్ణుడువైతే మీ భూమిని పేదలకివ్వొచ్చుగా? :N. Chandrababu Naidu

by Seetharam |   ( Updated:2023-07-25 08:55:56.0  )
జగన్! నువ్వు దానకర్ణుడువైతే మీ భూమిని పేదలకివ్వొచ్చుగా? :N. Chandrababu Naidu
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో రాష్ట్రంలోని విద్యార్థులు ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మూడు రాజధానులు అని చెప్పాలా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అమరావతి రైతులపై జగన్‍కు ఎందుకు కక్ష..? అని నిలదీశారు. రాజధాని రైతుల భూమిని వేరొకరికి దానం చేసిన జగన్ దాన కర్ణుడా అని ప్రశ్నించారు. అంత దానం చేసే గుణమే ఉంటే సీఎం జగన్ తన భూమిని ఇవ్వొచ్చుగా అని నిలదీశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో అన్నదాతలు కష్టాలు పడుతున్నారు అని చెప్పుకొచ్చారు. సాగును సీఎం జగన్ చంపేశాడు... రైతును నట్టేట ముంచేశాడు . జగన్‍కు వ్యవసాయంపై అవగాహన లేదని చంద్రబాబు విమర్శించారు. గోదావరి జిల్లాల మొదలు రాయలసీమ వరకు జగన్ పాలనలో ఏ ఒక్క రైతైనా బాగున్నాడా..? అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. జగన్ పాలనలో పుష్కలంగా సాగవుతున్న ఏకైక పంట గంజాయి అని ధ్వజమెత్తారు. ఈ దుర్మార్గుడి పాలనలో గంజాయి తప్ప మరో పంట సాగయ్యే పరిస్థితి లేదు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.

రైతులను వెర్రిపప్ప అంటారా?

రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్‌ది దేశంలో మూడో స్థానం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తప్పుడు లెక్కలు చూపడంలో జగన్ సిద్దహస్తుడు అని విమర్శించారు. ఏపీలో 93 శాతం రైతాంగం అప్పుల పాలైంది...దేశంలో సగటు రైతు అప్పు రూ.74 వేలు ఉంటే ఏపీలో సగటు రైతు అప్పు రూ.2,45,554 అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. పరిశ్రమలు వస్తే ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతాయని కానీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదన్నారు. చేతగాని ప్రభుత్వానికి నాలుగేళ్ల జగన్ పాలనే నిదర్శనం అని అన్నారు. ఏపీలో భూముల ధరలు.. వ్యవసాయంపై కేసీఆర్ కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు ఏపీలో ఎకరం భూమి అమ్మితే హైదరాబాద్‍లో మూడెకరాలు కొనేవాళ్లు..ఇప్పుడు హైదరాబాద్‍లో ఒక ఎకరం అమ్మితే ఏపీలో వంద ఎకరాలు కొనే దుస్థితి ఏర్పడింది అని చంద్రబాబు నాయుడు మరోసారి చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో అందరూ హాలిడే తీసుకుంటే ఒక్క రైతే పంట పండించి దేశానికి అన్నం పెట్టాడు అని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు.రైతులు ఎంతో కష్టపడి పంట పండిస్తే ధాన్యం సంచులు అందుబాటులో ఉండవు.. ఉన్న సంచులకు రంధ్రాలు ఉంటాయి . రైతులను పట్టుకుని ఓ మంత్రి వెర్రిపప్ప అంటాడా..? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోనే సంచులు మొదలు మిల్లర్ల వరకు ప్రతీ దానిలో దగా, మోసం అని ఆరోపించారు. రాయలసీమలో హార్టీ కల్చర్.. కోస్తాలో ఆక్వాకల్చర్ కు ప్రాధాన్యమిచ్చాం... ఇప్పుడు హార్టీకల్చర్, ఆక్వాకల్చర్ సంక్షోభంలో ఉన్నాయి. ఆక్వా రైతాంగానికి టీడీపీ ప్రభుత్వం యూనిట్ రూ.2కు విద్యుత్ ఇచ్చింది.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిట్ రూ.3.8 చేశాడు. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను ఆక్వా చెరువులకు పారించాం. ఇప్పుడు దాన్ని కూడా అడ్డుకున్నాడు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ పోతేనే రాష్ట్రం బాగు

వైఎస్ జగన్ నాలుగేళ్ల పాలనలో ప్రతిపక్షాలపై కేసులు..వనరుల దోపిడి తప్ప ఇంకేమీ లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అడ్డచూపులు.. దొంగ చూపులు తప్ప ఈ సీఎంకు ఇక వేటిపైనా శ్రద్ద లేదు అని విమర్శించారు. జగన్ అధికార వ్యామోహం రాష్ట్రానికి శాపంగా మారిందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘వ్యవస్థలను చంపేసి రివర్స్ గేర్‍లో నడిపిస్తున్నారు. సంక్షోభానికి కారణమైన జగన్‍కు పరిపాలించే అర్హత ఎక్కడిది..? ఆర్బీకేలు దోపిడీ కేంద్రాలుగా మారాయి. రైతులపై జగన్ ప్రభుత్వం అప్పుల భారం మోపింది. జగన్ మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో టమాట వేయడం మానేశారు. ఇప్పుడు టమాట ధరలు పెరగడానికి ఇదే కారణం. ముందుచూపుతో వ్యవహరిస్తే ఈ తిప్పులు ఉండేవి కావు.సీఎం జగన్‍కు ముందుచూపు లేదు.. ఎప్పుడూ పక్కచూపులే’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ‘టీడీపీ హయంలో 23 వేల ట్రాక్టర్లు ఇచ్చాం.ఇప్పుడు 6 వేల ట్రాక్టర్లు కూడా ఇవ్వలేదు. సూక్ష్మ పోషకాలు ఇవ్వట్లేదు. భూసార పరీక్షల్లేవు.. పంట దిగుబడి తగ్గింది. నీటి సెస్సు వెయ్యి లీటర్లకు రూ.12 నుంచి రూ.120చేశారు. కృష్ణా-గోదావరి నదులున్న ఈ రాష్ట్రంలో నీటిపై విపరీతమైన సెస్సులా? ఫుడ్ ప్రాసెసింగ్.. కోల్డ్ చెయిన్ లింకేజీ వ్యవస్థలను పటిష్టపరచాలని కృషి చేశాం. దౌర్భాగ్యం కలిసొచ్చి జగన్ సీఎం అయ్యారు.. రైతులు నాశనమయ్యారు’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్స్‌పైరీ డేట్ దగ్గర పడిందని..వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఓడించే బాధ్యత ప్రజలపైనే ఉందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇకనైనా ప్రజలు తెలుసుకోవాలని...జగన్ పోతేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. త్వరలోనే వ్యవసాయంపై ప్రత్యేక పాలసీని విడుదల చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

Advertisement

Next Story

Most Viewed