వైసీపీ శ్రేణుల్లో అయోమయం జగన్నాథం!

by Mahesh |
వైసీపీ శ్రేణుల్లో అయోమయం జగన్నాథం!
X

దిశ ప్రతినిధి, కర్నూలు: వైసీపీ ముఖ్య నేతల రాజీనామాల పర్వం తో ఆ పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొని ఉంది. ఓటమి తర్వాత రోజుకొకరు పార్టీని వీడడం కలవరానికి గురి చేస్తోంది. కొందరు సైలెంట్‌గా ఉన్నా.. మరోవైపు కేసుల భయంతో టెన్షన్ పడుతున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యులు, ఒక ఎమ్మెల్సీ పార్టీకి రాజీనామా చేయడంతో జిల్లా నేతల్లో టెన్షన్ నెలకొని ఉంది.

సీన్ రివర్స్..

2019 ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా, తాజా ఎన్నికల్లో టీడీపీ 12 స్థానాలను కైవసం చేసుకోగా, వైసీపీ రెండింటితో సరిపెట్టుకుంది. ఘోర పరాభవం తో వైసీపీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో పడిపోయారు. జిల్లాలో కేవలం నలుగురైదుగురు మినహా మిగతా నేతలంతా అజ్ఞాతంలో కెళ్లిపోయారు. నియోజకవర్గాల్లో ఇప్పటివరకు అడుగు పెట్టలేదు. వార్తా కథనాల నేపథ్యంలో కొందరు అలా వచ్చి ఇలా వెళ్లి పోతున్నారు. వీరి తీరుతో అటు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఇటు కార్యకర్తలు అభద్రతాభావానికి లోనయ్యారు. చాలా మంది టీడీపీలో చేరి పోయారు. తాజాగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా నేపథ్యంలో వైసీపీ జిల్లా నేతలు మరింత కలవరపాటుకు లోనవుతున్నారు.

సొంత పనుల్లో బిజీ.. బిజీ..

కర్నూలు జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాత్రమే అందుబాటులో ఉన్నారు. కానీ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ హఫీజ్ ఖాన్, ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎండీ ఇంతియాజ్ నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఎవరికి వారుగా తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య ఉన్నా లేనట్లుగానే పరిస్థితి ఉంది. పాణ్యం, బనగానపల్లె, ఆదోని ప్రాంతాల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, రామి రెడ్డి, వై.సాయి ప్రసాద్ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డిలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నారు.

విరూపాక్షి గెలిచినా..

ఆలూరులో ఎమ్మెల్యేగా విరుపాక్షి గెలిచినా.. ప్రజలకు అందుబాటులో లేరు. ఇక డోన్, శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, కోడుమూరు, నందికొట్కూరు, పత్తికొండ ప్రాంతాలకు చెందిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, రవిచంద్ర కిశోర్ రెడ్డి, కంగాటి శ్రీదేవి, మాజీ ఎంపీలు బుట్టా రేణుక, పోచా బ్రహ్మానందరెడ్డి దూరంగా ఉన్నారు. కొందరు తమ ఆస్తులు కాపాడుకునేందుకు వైసీపీని వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ప్రయత్నాలు ఫలించి పోవడం, వైసీపీ అధిష్టానం నుంచి స్వీట్ వార్నింగ్ లు రావడంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నట్లు తెలుస్తోంది. కానీ, వైసీపీ ముఖ్య నేతలు రాజీనామాలు మాత్రం ఆగడం లేదు. ఈ ప్రభావం ఉమ్మడి జిల్లాపై పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.

Advertisement

Next Story