Kappatrall : కలెక్టర్ హామీతో కప్పట్రాళ్ల వాసుల ఆందోళన వాయిదా

by Y. Venkata Narasimha Reddy |
Kappatrall : కలెక్టర్ హామీతో కప్పట్రాళ్ల వాసుల ఆందోళన వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్ : యురేనియం( Uranium mining) తవ్వకాలను నిలిపివేయాలని కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల(Kappatrall) గ్రామస్థులు చేపట్టిన ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా బాధిత గ్రామాల ప్రజలు ఐక్య కార్యాచరణ కమిటీని ఎన్నుకుని వరుస ఆందోళనలకు పిలుపునిచ్చారు. కప్పట్రాళ్ల రక్షిత అడవిలో కేంద్ర సర్కారు యురేనియం తవ్వకాలకు 68 బోర్లకు అనుమతులు ఇవ్వడంపై చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. కప్పట్రాళ్ల యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా వేలాది మంది శనివారం పత్తికొండ-కర్నూలు రహదారిపై బైఠాయించారు. మూడు గంటలపాటు ఆందోళన చేయగా, 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కప్పట్రాళ్ల, బేతపల్లి, పి.కోటకొండ, చెల్లెలచెలిమిల మాదాపురం, నెల్లిబండ, గుండ్లకొండ తదితర గ్రామాల నుంచి ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చి ఆందోళనల్లో పాల్గొన్నారు.

కాగా ప్రజల ఆందోళన అంశాన్ని అధికారులు జిల్లా కలెక్టర్ (Collector) కు వివరించగా ఆయన ఈ నెల 4వ తేదీన వచ్చి చర్చిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. యురేనియం త్రవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్థానిక ప్రజలు హెచ్చరించారు. ఆదోని రేంజ్ పత్తికొండ సెక్షన్ పరిధిలోని కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ పరిధిలో 468.25 హెక్టార్ల అటవీ భూములు ఉన్నాయని, ఈ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు అనుమతిస్తే అన్ని విధాలుగా నష్టపోతామని ప్రజలు తీవ్ర వ్యతిరేతను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed