బెయిల్ వచ్చేనా?: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సర్వత్రా ఉత్కంఠ

by Seetharam |   ( Updated:2023-10-03 05:42:21.0  )
బెయిల్ వచ్చేనా?: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సర్వత్రా ఉత్కంఠ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ రాజకీయాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టై ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడును బెయిల్‌పై బయటకు తీసుకువచ్చేందుకు టీడీపీ శత విధాలా ప్రయత్నిస్తున్నా అవేమీ ఫలించడం లేదు. స్కిల్ స్కామ్ కేసును సవాల్ చేస్తూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా అది తిరస్కరణకు గురైంది. మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టు సైతం బెయిల్ తిరస్కరించింది. దీంతో టీడీపీ ముందు ఉన్న ఏకైక మార్గం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో కూడా హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ విచారణ రానుంది. 6వ నెంబర్ కోర్టులో జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం చంద్రబాబు పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. జాబితాలో చిట్టచివరి కేసు(63)వ నంబర్‌గా చంద్రబాబు కేసు లిస్ట్ అయ్యింది. మరోవైపు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

సెక్షన్ 17ఏపైనే భారమంతా

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ వర్తిస్తుందని సుప్రీంకోర్టులోనూ చంద్రబాబు నాయుడు తెలిపారు. గతవారంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ఎదుట చంద్రబాబు కేసు విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే విచారణ నుంచి జస్టిస్ ఎస్వీఎన్ భట్టి విచారణ నుంచి తప్పుకున్నారు. అదే రోజు సీజేఐ ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. దీంతో మరో బెంచ్‌కు కేసు విచారణను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఇకపోతే మంగళవారం జరగబోయే విచారణలో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తిస్తుందని ఆయన తరఫు న్యాయవాదులు వాదించనున్నారు. చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా, హరీశ్ సాల్వేలు వాదనలు వినిపించనున్నారు.

ఏపీ ప్రభుత్వం కేవియట్ పిటిషన్

ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఏపీ ప్రభుత్వం సైతం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేసు విచారణలో తమ వాదనలు కూడా వినాలని ఏపీ ప్రభుత్వం కోరింది. తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని సుప్రీం కోర్టును కోరింది. అంతేకాదు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు అందుకు అవసరమైన ఆధారాలను సైతం పట్టుకుని సీఐడీ అధికారులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story