జగన్ వ్యూహాలు మళ్లీ గట్టెక్కించేనా!

by samatah |
జగన్ వ్యూహాలు మళ్లీ గట్టెక్కించేనా!
X

కొత్తగా పెట్టిన ఒక పార్టీ ఎన్నికల్లో ఓడితే మళ్లీ కోలుకోవడం అంత తేలిక్కాదు. రెండోసారి ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలు గెలవడం రాష్ట్ర చరిత్రలో లిఖించదగ్గ అంశం. అలాంటి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్సార్ ​కాంగ్రెస్​ పార్టీ కేవలం 46 నెలల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సివస్తోంది. ఏకఛత్రాధిపత్యంగా వెలుగొందిన పార్టీలోనే అసమ్మతులు పెచ్చరిల్లుతున్నాయి. క్షేత్ర స్థాయి కార్యకర్తల్లో సైతం అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఒకనాడు నీరాజనాలు పట్టిన వర్గాలు నేడు జగన్ ​కాకుండా మరెవరైనా పర్వాలేదని భావించడం అవగాహన రహిత పాలన వల్లేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వాన్ని, పార్టీని సమర్ధంగా నడపడంలో సీఎం జగన్​ వైఫల్యమే దీనికి కారణమని అంటున్నారు.

దిశ, ఏపీ బ్యూరో : వైసీపీ అధినేత ​జగన్ ​ప్రజా సంకల్పయాత్ర మెజారిటీ ప్రజల్లో ఎన్నో ఆశలు, ఆకాంక్షలను పెంచింది. సీఎంగా ప్రమాణం చేసిన రోజు నుంచి జగన్​లో వచ్చిన విపరీత మార్పులను పార్టీ విజయానికి దోహదపడిన వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. మూడేళ్ల పాటు ఆయన నేరుగా ప్రజలను కలుసుకోవడానికి ఇష్టపడలేదు. ఎమ్మెల్యేలు, మంత్రులకు సైతం అపాయింట్​మెంటు దొరకడం గగనమైంది. కేవలం సలహాదారులు, పార్టీ కోర్​ కమిటీతో భేటీలకే పరిమితమయ్యారు. విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి పెత్తనమిచ్చారు. మంత్రులను డమ్మీలను చేశారనే అపవాదును మూటగట్టుకున్నారు. చివరకు సజ్జలను సకల శాఖా మంత్రిగా విపక్షాలు ఎద్దేవా చేసేదాకా వెళ్లారు. అంతా తానై తాడేపల్లి నివాసం నుంచే పాలన సాగించారు. మూడున్నరేళ్ల తర్వాత కోర్​కమిటీ నేతలు క్రమేణా తెరమరుగవుతున్నారు. నామ్​కే వాస్తేగా మారిపోయారు.

హామీలు గాలికి..

జగన్​ పాదయాత్రలో ఇచ్చిన ముఖ్యమైన వాగ్దానాలు నేటికీ నెరవేరలేదు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధిస్తారనే ఆశలను వమ్ము చేశారు. కేవలం నవరత్నాలపైనే ఫోకస్​పెట్టారు. సంక్షేమ పథకాలే మళ్లీ గద్దెనెక్కిస్తాయని బలంగా నమ్మారు. పార్టీ కార్యకర్తలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని పక్కన పెట్టారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ, మండల, పురపాలక సంఘాల పాలకవర్గాలను నిర్వీర్యం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలతో కొత్తగా ఉద్యోగులను, వలంటీర్లను నియమించారు. దాదాపు మూడేళ్లపాటు సచివాలయాలు, కలెక్టర్లతో నవరత్నాలు అమలు చేస్తూ వచ్చారు.

అభివృద్ధికి బాటలేవీ..

కరోనాతో ప్రజలు తల్లడిల్లారు. పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయారు. పేదలు మరింత నిరుపేదలయ్యారు. దిగువ మధ్య తరగతి పేదరికంలోకి జారిపోయింది. వైద్యం కోసం ప్రజలు హాహాకారాలు చేశారు. ప్రైవేటు కార్పొరేట్​ ఆస్పత్రుల దోపిడీని కళ్లారా చూశారు. ఆ అనుభవంతో నాడు–నేడు కింద ఆస్పత్రులు, పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కదిలింది. కరోనా అనంతరం ప్రజలకు ఉపాధితో కూడిన అభివృద్ధికి బాటలు వేయడాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయి. సుమారు ఏడాదిన్నరపాటు కరోనా ఆంక్షలు కొనసాగాయి. ఆ కాలంలో రోడ్డున పడిన కుటుంబాలను ప్రభుత్వాలు పట్టించుకోలేదు. పేదలకు బియ్యం, పప్పు, ఓ వెయ్యి రూపాయలు ఇచ్చి సరిపెట్టారు.

బాదుడే బాదుడు..

కొవిడ్ ​కష్టాలతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవడానికి బదులు పెద్ద ఎత్తున ఎక్సైజ్ ​సుంకాన్ని విధించి పెట్రోలు, డీజిల్​రేట్లు పెంచేశారు. దీంతో రవాణా ఖర్చులు పెరిగాయి. నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. అన్ని రకాల సేవలు ప్రియమయ్యాయి. వంట గ్యాస్​ధరలు పెంచారు. కొవిడ్​ అనంతరం కాలంలో నిత్యావసరాలపై కూడా జీఎస్టీ విధించారు. రకరకాల పేరుతో విద్యుత్​చార్జీలను పెంచేశారు. సగటు ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది. ప్రజలపై విధించిన భారాల దెబ్బకు నవరత్నాల పథకాలు ఎందుకూ కొరగాలేదు. అందుకే సామాన్య ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది.

చేతులు కాలాక..

సుమారు మూడేళ్లపాటు పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదు. అసలు పార్టీ కార్యక్రమం అంటూ ఏదీ లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టారీతిన వ్యవహరించారు. కోటరీలు కట్టుకొని జనానికి దూరమయ్యారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇటీవలే కళ్లు తెరిచారు. గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలను జనంలోకి పంపారు. ప్రజల నుంచి నిరసనలను ఎదుర్కోవాల్సి వచ్చింది. సంక్షేమ పథకాలు ఎక్కడ నిలిపేస్తారోనని చాలావరకు జనం భయపడి నోరు మెదపలేదు. గడప గడపకూ కార్యక్రమానికి పార్టీ యంత్రాంగం సహకరించడం లేదని గుర్తించారు. వలంటీర్లు ఓట్లు వేయించలేరని గ్రహించారు. ఇప్పుడు రథసారథులు, సచివాలయ కన్వీనర్లను నియమిస్తున్నారు. సామాన్య జనంలో నెలకొన్న ఆక్రోశాన్ని వీళ్లు తొలగించగలరా? గత ఎన్నికల్లో సహకరించిన వర్గాల్లో ఆగ్రహాన్ని తొలగించగలరా ! ఇళ్లకు స్టిక్కర్లు వేసినంత మాత్రాన ఓట్లు రాలతాయా ? జగన్​ వ్యూహం సత్ఫలితాలను ఇస్తుందా అనేది అటు పార్టీ శ్రేణుల్లో, ఇటు ప్రజల్లో చర్చనీయాంశమైంది.

Next Story

Most Viewed