AP News:చెలరేగిన చింతమనేని..సమావేశంలో అధికారుల తీరుపై ధ్వజం

by Jakkula Mamatha |   ( Updated:2024-08-30 15:03:12.0  )
AP News:చెలరేగిన చింతమనేని..సమావేశంలో అధికారుల తీరుపై ధ్వజం
X

దిశ, ఏలూరు:ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేలకు సంధించిన ప్రశ్నలకు అధికారగణం నీళ్లు నమిలింది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పలు అంశాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి నిమ్మల కూడా అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో జడ్పీ సర్వసభ్య సమావేశం అధ్యక్షురాలు ఘంటా పద్మశ్రీ అధ్యక్షత వహించారు. సమావేశం ప్రారంభం కాగానే గత వైసీపీ పాలన అక్రమాలపై అధికారులను దెందులూరు ఎమ్మెల్యే.చింతమనేని ప్రభాకర్ నిలదీశారు.

దెందులూరు లోని ఆరోగ్య కేంద్రాల్లో జరిగిన అవకతవకలపై అధికారులను చింతమనేని వివరణ అడిగారు. దీనిపై పొంతన లేని సమాధానాలు అధికారులు చెప్పడంతో చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కంగారు పడి చింతమనేని ప్రసంగాన్ని జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ అడ్డుకున్నారు. ఇది సర్వసభ్య సమావేశం ప్రజల సమస్యలను ప్రజాప్రతినిధులు చర్చించే వేదిక సమస్యల పై మాట్లాడొద్దని ఎమ్మెల్యేలను మీరు ఎలా అడ్డుకుంటారు అంటూ చింతమనేని నిలదీశారు. ఉమ్మడి జిల్లాలో పేరుకుపోయిన సమస్యలపై ప్రజా ప్రతినిధులు నిజంగా చర్చించి పరిష్కారం పొందాలి అంటే తూతూ మంత్రంగా 2 గంటల్లో సభ నిర్వహిస్తే సరిపోదు.

కనీసం ఒక రోజు సమయం కేటాయించండి అంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఇది జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం - కనీసం జెడ్పీటీసీ సభ్యులు తమ సమస్యలు చెప్పుకునే సమయం కూడా ఇవ్వలేకపోతే సభ లక్ష్యం ఎలా నెరవేరుతుంది?..ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి అంటూ జెడ్పీ చైర్ పర్సన్ తీరుని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రశ్నించారు. సభలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ అసలు ఎమ్మెల్యే చింతమనేని చాలా సూటిగా ప్రశ్నలు అడిగారు, కానీ మీరు వాటికి స్పష్టత లేని సమాధానాలు ఇస్తున్నారు, మీ సమాధానాలు నాకు కూడా అర్థం కాలేదు" అంటూ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed