నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలుషిత ఆహారం..సీఎం చంద్రబాబు సీరియస్

by Jakkula Mamatha |   ( Updated:2024-08-31 14:20:34.0  )
నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలుషిత ఆహారం..సీఎం చంద్రబాబు సీరియస్
X

దిశ,ఏలూరు:ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత పది రోజులుగా కలుషిత ఆహారం తిని 1300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ట్రిపుల్ ఐటీలో జరిగిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌గా వున్నట్లు సమాచారం. దీంతో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శనివారం ట్రిపుల్ ఐటీని సందర్శించారు. ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సౌకర్యాల విషయంలో సమూలమైన మార్పు రావాలని ఆయన ఆదేశించారు. విద్యార్థులు చదువుకునేందుకు చక్కని వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను మంత్రి తనిఖీ చేశారు. కిచెన్, మెస్‌లను పరిశీలించారు. ఆహార పదార్థాల తయారీ విధానాన్ని, కిచెన్, మెస్‌లలో పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. తాగునీటిని స్వయంగా తాగారు. విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన నూజివీడు ట్రిపుల్ ఐటీ లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉన్నారని, విద్యార్థులకు చదువుకునేందుకు చక్కని వాతావరణం కల్పించాలని ఆదేశించారన్నారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై జాయింట్ కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, తదితరులు తనిఖీ నిర్వహించాలన్నారు. నాణ్యత లేని ఆహారం, పారిశుధ్యం లేకపోవడం కారణంగానే విద్యార్థులు వ్యాధుల బారిన పడ్డారన్నారు. గత ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్‌లు, మెస్ చార్జీలు ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని, ఈరోజు తాను విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నానని, ఇంత తనిఖీలు జరిగి, హెచ్చరికలు చేసిన తర్వాత ఆహార నాణ్యతలో కొంత మాత్రమే మెరుగుదల కనపడిందన్నారు.

నిబంధనల మేరకు సేవలందించని కాంట్రాక్టర్లను తొలగించి, కొత్త కాంట్రాక్టర్లను నియమించాలని మంత్రి ట్రిపుల్ ఐటీ అధికారులను ఆదేశించారు. ట్రిపుల్ ఐటీలో కిచెన్, మెస్, డైనింగ్‌లలో పరిశుభ్రత, ఆహార పదార్థాలు నాణ్యత పరిశీలన, ఆహార నాణ్యతను పర్యవేక్షించేందుకు గాను ప్రతీ మెస్‌కి ఒక ఫుడ్ టెక్నాలజీలో అర్హత కలిగిన వారిని అవుట్ సోర్సింగ్‌లో నియమించాలన్నారు. మంత్రి వెంట ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ చంద్రశేఖర్, పరిపాలనాధికారి, సిబ్బంది పాల్గొన్నారు. కాగా మంత్రికి సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా కొందరిని హాస్టల్ రూమ్ బయట గడియ పెట్టారని విద్యార్థులు ఆరోపించారు. వారికి అందజేసిన అన్నం మీడియాకు చూపించారు. తమకు సరైన పరిశుభ్రమైన ఆహారం ఇవ్వడం లేదని ఆరోపించారు.

Advertisement

Next Story