ఏపీ ప్రభుత్వమే ఫైన్ వేస్తే మంచిదేమో..!

by srinivas |
ఏపీ ప్రభుత్వమే ఫైన్ వేస్తే మంచిదేమో..!
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో అతి పెద్ద నగరమైన విశాఖలో భవన నిర్మాణాలపై పెద్ద ఎత్తున వస్తున్న ఫిర్యాదులు మహా విశాఖ నగర పాలక సంస్ధ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులను కలవరపెడుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్ ) మహా విశాఖ నగర పాలక సంస్ధకు పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇందులో వస్తున్న సమస్యలను పరిష్కరించలేక అధికారులు తలలు పట్టుకొంటున్నారు.

80 శాతం ఫిర్యాదులు భవన నిర్మాణాల మీదే

ప్రతి సోమవారం జీవీఎంసీ కమిషనర్ , మేయర్ అన్ని పనులు మానేసి ఇతర అధికారులతో కలసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అయితే, ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చే జనం కంటే నగరంలో జరుగుతున్న నిర్మాణాల మీద వాటితో ఏ మాత్రం సంబంధం, వాటి కారణంగా ఇబ్బందులు ఎదుర్కోని వారే పెద్ద ఎత్తున ఫిర్యాదుల చేస్తున్నారు. అందులో వంద గజాల లోపు సామాన్యులు, పేదలు నిర్మిస్తున్న కట్టడాల మీద కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదుల వస్తున్నాయి. వంద ఫిర్యాదుల్లో 80 భవన నిర్మాణాల మీద అయితే, ఎనిమిది సదుపాయాల కల్పన మీద , మిగిలిన 12 వ్యక్తిగత సమస్యల మీద వచ్చాయని అధికారుల పరిశీలనతో వెల్లడైంది.

విలేకరుల పేరిటే అధిక ఫిర్యాదులు

విచిత్రంగా విలేకరుల పేరిట వారి గుర్తింపు కార్డు జిరాక్సులు, లెటర్ హెడ్‌లు, విజిటింగ్ కార్డులను జతచేస్తూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఫిర్యాదులకు తగ్గట్టుగా పత్రికల్లో అన్ని వార్తలు కూడా రావడం లేదు. కొందరు వెబ్ సైట్‌లు, యూట్యూబ్ ఛానళ్ల పేరిట కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. ఒక వారం జీవీఎంసీకి వంద ఫిర్యాదులు వస్తే అందులో 80 భవన నిర్మాణాల అక్రమాల గురించే కావడం అందులో విలేకరులే ఎక్కవ ఫిర్యాదులు చేయడం అధికారులను పునరాలోచనలో పడేసింది. ఎందుకు ఇంత మంది విలేకరుల పేరిట ఫిర్యాదులు చేస్తున్నారనే అంశంపై వివరాలు సేకరిస్తున్నారు.

మెజారిటీ ఫిర్యాదుల లక్ష్యం వసూళ్లే

భవన నిర్మాణాల్లో అక్రమాలంటూ వస్తున్న మెజారిటీ ఫిర్యాదుల లక్ష్యం అక్రమ వసూళ్లే అని తెలిసి అధికారులు ఆశ్చర్యపోయారు. వీరితో ఫిర్యాదలు చేయిస్తున్న వారిలో కొందరు కార్పొరేటర్లతో పాటు టౌన్ ప్లానింగ్ అధికారులు ,సిబ్బంది కూడా ఉండడం గమనార్హం. కేవలం వసూళ్ల కోసమే ఈ రకమైన ఫిర్యాదులు వస్తున్నాయని, అక్రమ నిర్మాణాన్ని సక్రమం చేసే ఉద్దేశం వీటి వెనుక లేదని తెలిసి ఆశ్చర్యపోయారు.

ప్రభుత్వమే ఫైన్ వేస్తే మంచిదేమో..

అక్రమ కట్టడాల విషయంలో గతంలో ప్రభుత్వం బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీమ్ (బీఆర్‌ఎస్) ను ప్రవేశ పెట్టింది. అటువంటి పధకం ద్వారా అక్రమ కట్టడాలనుంచి ప్రభుత్వమే అపరాధ రుసుము వసూలు చేస్తే ఈ రకమైన బ్లాక్ మెయిలింగ్ కు అవకాశం వుండదని అధికారులు భావిస్తున్నారు. ఈ ఫిర్యాదుల తరువాత అక్రమ కట్టడాల కూల్చవేతలు కూడా పెద్దగా ఉండటం లేదని, కేవలం భవనాలు కట్టేవారే లక్షల్లో సమర్పించుకోవాల్సి వస్తుందని అంటున్నారు. దీంతో, కొన్ని రాష్ర్టాల్లో అదనపు అంతస్తుకు, అదనపు నిర్మాణాలకు ఫైన్ విధించే నిబంధనలను వున్నాయని, అటువంటివి తీసుకువస్తే మంచిదంటూ జీవీఎంసీ అధికారులు రాష్ర్ట పురపాలక శాఖకు ప్రతిపాదన పంపాలని భావిస్తున్నారు. అటువంటి నిబంధనల వస్తే ఫిర్యాదులు, వసూళ్లు తగ్గుతాయని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed