Visakha Dairy చైర్మన్‌ ఆడారి తులసీరావు కన్నుమూత

by srinivas |
Visakha Dairy చైర్మన్‌ ఆడారి తులసీరావు కన్నుమూత
X

దిశ ఉత్తరాంధ్ర: విశాఖ డైయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. భారత దేశంలో పాడి పరిశ్రమలోనే చరిత్ర సృష్టించిన ఘనత విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావుది. ఏకధాటిగా 37 ఏళ్ళ పాటు విశాఖ డెయిరీ చైర్మన్‌గా పాడి రైతుల అభ్యన్నతి కోసం అహర్నిశలూ కృషి చేశారు. ప్రజలకు నాణ్యత, నవ్యతతో కూడిన పాల ఉత్పత్తులను అందివ్వడంలో సఫలీకృతులయ్యారు. ఆంధ్రా కురియన్‌గా పేరొందారు. 1986 ఆగస్టు 29వ తేదీన విశాఖ డెయిరీ చైర్మన్‌గా తులసీరావు డెయిరీ రంగంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఉత్తరాంధ్రలో పాల పొంగులు మొదలయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు యావత్‌ భారతదేశంలో డెయిరీ రంగం తనను అనుసరించే స్థాయికి తులసీరావు ఎదిగిపోయారు. డెయిరీ ద్వారా పాల రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు. రైతుల పిల్లలకు విద్య, వైద్యం ఉచితంగా అందించి వారి ఉన్నతి కోసం బాటలు వేశారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తులసీరావు తన గురువు రాజ్యసభ మాజీ సభ్యులు స్వర్గీయ వి.వి.రమణ అడుగుజాడల్లో నడిచి ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. 23వ ఏటనే కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌గా ఎన్నికై సహకార రంగం ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుందో అవగాహన చేసుకున్నారు. రైతులో రైతుగా మారిపోయి వారి అభ్యునత కోసం అహర్నిశలూ కష్టపడ్డారు. కేవలం 11 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన డెయిరీని ఇప్పుడు 1500 కోట్ల టర్నోవర్‌కు తీసుకొచ్చి విజయకేతనం ఎగురవేశారు.

Advertisement

Next Story