Visakha Steel Plant: భిన్న ప్రకటనలతో గాలి తీసేశారుగా...!

by srinivas |   ( Updated:2023-04-13 16:08:15.0  )
Visakha Steel Plant: భిన్న ప్రకటనలతో గాలి తీసేశారుగా...!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేం. ఎప్పుడు ఏ నాయకుడు ఎలాంటి ప్రకటన చేస్తారో తెలీదు. ఆ ప్రకటన నిజమనుకుని ఆనందపడేలోపు తూచ్ నేనలా అనలేదు అని కొట్టిపారేసే ఘటనలు తరచూ రాజకీయాల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఏపీ రాజకీయాల్లో జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికిప్పుడే ప్రైవేట్ పరం చేయాలనుకోవడం లేదని ప్రకటించేశారు. అర్ఐఎన్ఎల్ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నామని.. ముడిసరుకు పెంపొందించే ప్రక్రియపై దృష్టి పెట్టినట్లు ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుందని ఆందోళనలో ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించింది.

అంతేకాదు కేంద్రమంత్రి ప్రకటన క్రెడిట్‌ కొల్లగొట్టేందుకు కూడా రాజకీయ పార్టీలో పోటీపడ్డాయి. కేసీఆర్ వల్లే కేంద్రం వెనక్కి తగ్గిందని బీఆర్ఎస్ అంటే... తాము కేంద్రాన్ని పునరాలోచించడం వల్లే ఈ రిజల్ట్ అని వైసీపీ చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఇంతలో తాము కూడా కేంద్రాన్ని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని కోరామని పవన్ కల్యాణ్ కూడా చెప్పుకొచ్చేశారు. అంతేకాదు ఇకపై స్టీల్ ప్లాంట్ కేంద్రప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని కూడా సూచించేశారు. ఇలా ఎవరికి వారు క్రెడిట్ కోసం ఆర్భాటాలు చేస్తున్న తరుణంలో కేంద్రమంత్రి తూచ్ నేనలా అనలేదు అంటూ నీళ్లు చల్లేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల రాజకీయం ఒక్కసారిగా నీరసించిపోయినట్లైంది.

మార్నింగ్ ఇలా

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఏపీ, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. తెలంగాణ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొనాలన్న ప్రకటనను ప్రభుత్వంలోని మంత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని వైసీపీ మంత్రులు చెప్తున్నారు. నిన్న మెున్నటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమన్న కేసీఆర్ ఇప్పుడు ఎలా బిడ్డింగ్ వేస్తారని నిలదీశారు. అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీఆర్ఎస్ అనుకూలమనేగా అని విమర్శలు చేశారు. ఇదే తరుణంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఏపీలో ఏముందని రోడ్లు లేవు, సంక్షేమం లేదు తెలంగాణకు వచ్చి ఇక్కడే ఓట్లు పొందొచ్చుకదా అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి తరుణంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే విశాఖ పర్యటనలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు.‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదు. ప్రస్తుతానికి ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. ముందు అర్ఐఎన్ఎల్ (రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్) ను బలోపేతం చేసే పనిలో మేం ఉన్నాం. ప్లాంట్ లో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నాం. పూర్తి స్థాయి సామర్ధ్యం మేరకు ప్లాంట్ పని చేసే ప్రక్రియ జరుగుతోంది. అర్ఐఎన్ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తాం’ అని కేంద్రమంత్రి ప్రకటించారు.

అంతేకాదు బీఆర్ఎస్ పార్టీపైనా విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్‌లో పాల్గొనడం అనేది ఒక ఎత్తుగడ మాత్రమేనంటూ వ్యాఖ్యానించారు. స్టీల్‌ ప్లాంట్‌లో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నామని.. ప్లాంట్‌ను బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ముడిసరుకు పెంపొందించే ప్రక్రియపై దృష్టి పెట్టినట్లు వివరించారు. కేంద్రమంత్రి ప్రకటనతో ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అటకెక్కినట్లేనని వార్తలు వెలువడ్డాయి. ఉక్కు యూనియన్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇదే తరుణంలో ఈ క్రెడిట్ కొట్టేందుకు అటు బీఆర్ఎస్ ఇటు వైసీపీ సైతం పోటీపడ్డాయి. అయితే ఈ రేసులో బీఆర్ఎస్ కాస్త ముందు వరుసలో ఉంది

కేసీఆర్ దెబ్బ అట్లుంటది : కేటీఆర్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని ఇప్పటికిప్పుడు ప్రైవేటీకరణ చేయాలని భావించడం లేదని వ్యాఖ్యలపై స్పందిస్తూ..వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు చెప్పారని... ఆయన పోరాటంతో కేంద్రం వెనకడుగు వేసిందని చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడింది కేసీఆరేనని వ్యాఖ్యానించారు.తాము తెగించి పోరాడాం కనుకనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకణపై కేంద్రం తగ్గిందని ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునేందుకు కేటీఆర్ ప్రయత్నించారు. కేసీఆర్ దెబ్బ అంటే ఇలాగే ఉంటుందని ఐటీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పోరాడింది : హరీశ్ రావు

విశాఖ ఉక్కు పరిశ్రమను ఇప్పటికిప్పుడు ప్రైవేటీకరణ చేయాలని తాము భావించడం లేదన్న కేంద్రమంత్రి ప్రకటనపై మంత్రి హరీశ్ రావు కూడా స్పందించారు. కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చిందని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కును అమ్మబోవడంలేదని, బలోపేతం చేస్తామని కేంద్రం ప్రకటించిందని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఇది కేసీఆర్ సాధించిన విజయం... ఇది బీఆర్ఎస్ విజయం... ఇది ఏపీ ప్రజల విజయం... ఇది విశాఖ కార్మికుల విజయం అని హరీశ్ రావు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తమపై ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. విశాఖ ఉక్కు గురించి కేసీఆర్, కేటీఆర్, తాను మాట్లాడటంపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. విశాఖ ఉక్కుపై ఏపీ అధికారపక్షం, ప్రతిపక్షం నోరు విప్పలేదని చెప్పుకొచ్చారు.ఏపీ ప్రజలు, కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పోరాడిందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో కేంద్రంపై పోరు కొనసాగిస్తామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.

కేసీఆర్ వల్లే కేంద్రం ఆలోచనలో పడింది : సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ వల్లే కేంద్రంలో మార్పు వచ్చిందని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. ఒక బృందాన్ని పంపడం ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈవోఐ (బిడ్డింగ్)లో పాల్గొనేందుకు చర్యలు తీసుకున్నందుకు కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ వల్లే కేంద్రం ఆలోచనలో పడిందని, తెలంగాణ బృందం రావడం వల్లే ప్రస్తుతానికి ప్రైవేటీకరణకు వెళ్లకూడదని, ఆర్ఎన్ఐఎల్ ను బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొనాలని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.

సాయంత్రానికి మాట మారింది

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదు. ప్రస్తుతానికి ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. ముందు అర్ఐఎన్ఎల్ (రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్)ను బలోపేతం చేసే పనిలో మేం ఉన్నామంటూ తొలుత మాట్లాడిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే సాయంత్రానికి మాట మార్చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వెనక్కు తీసుకునే అంశం కేంద్ర కాబినెట్ పరిధిలో ఉంటుందని వెల్లడించారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని చెప్పుకొచ్చారు. గురువారం సాయంత్రం నోవాటెల్ హోటల్‌లో కేంద్రమంత్రిని విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట సమితి నాయకులు స్థానిక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో వెళ్లి కలిశారు. ఈ సందర్బంగా ఉక్కు యూనియన్ నాయకులకు బాంబ్ పేల్చారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తాను తీసుకోవలసిన నిర్ణయం కాదని, పాలసీ మేటర్ గనుక కాబినెట్‌‌కి మాత్రమే అధికారం ఉందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే వెల్లడించారు. దీంతో ఎంతో ఉత్సాహంగా కేంద్రమంత్రిని కలిసేందుకు వెళ్లిన నేతలు ఉసూరు మంటూ వెనుదిరిగారు.

అమిత్ షాను కలిసి విన్నవించాం: పవన్ కల్యాణ్

విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ప్రకటనను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సైతం స్వాగతించారు. కేంద్రమంత్రి ప్రకటన ఆశాజనకంగా ఉందని వెల్లడించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ తెలుగు ప్రజల సెంటిమెంట్ అని.. 32 మంది ప్రాణత్యాగాలతో సాకారమైన విశాఖ ఉక్కు పరిశ్రమ ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తారన్న అంశం వచ్చినప్పుడు ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిశామని.. జనసేన పక్షాన స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిలిచి భారీ బహిరంగ సభ నిర్వహించిన అంశాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర పాలకులు అఖిలపక్షాన్ని తీసుకుని కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లాలని విజ్ఞప్తి చేసినా వైసీపీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని విమర్శించారు. ఢిల్లీలో అమిత్ షాను కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ తో తెలుగు ప్రజల భావోద్వేగ అనుబంధాన్ని వివరించామని..ఈ పరిశ్రమను ప్రత్యేక దృష్టితో చూడాలని కోరినట్లు గుర్తు చేశారు. ఈ విశాఖ ఉక్కుపై పొరుగు రాష్ట్రం స్పందించిందని..కానీ దీని వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలు, నేపథ్యాలపై వైసీపీ పాలకులు విమర్శలు చేస్తున్నారే తప్ప, పరిశ్రమను కాపాడతామనే మాట చెప్పలేకపోయారని పవన్ కల్యాణ్ విమర్శించారు.

Advertisement

Next Story