Ap Package: ఆ సెంట్‌మెంట్ వల్లే ఏపీకి ప్యాకేజీ: కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2025-01-23 10:49:05.0  )
Ap Package: ఆ సెంట్‌మెంట్ వల్లే ఏపీకి ప్యాకేజీ: కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌(Visakha Steel Plant)కు ఆదుకునేందుకు కేంద్రం ముందుకు వచ్చి ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్యాకేజీ ప్రకటన వెనుకున్న అసలు విషయాలను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం(Bheemavaram)లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రజలకు కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ(Union Minister Srinivasa Varma) వివరించారు. స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ. 11, 440 కోట్లు కేటాయించిందని, అయితే అందులో రూ.10,300 కోట్లు కేపిటల్ వాటా కింద ఇచ్చినట్లు పేర్కొన్నారు. మిగిలిన 1,440 కోట్లు వర్కింగ్ కేపిటల్‌గా కేటాయించినట్లు స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించి స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ. 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించినట్లు శ్రీనివాసవర్మ తెలిపారు.

ఏపీ చరిత్రలోనే ఇప్పటివరకూ ఇలాంటి పెద్ద ప్యాకేజీ ఇవ్వలేదని, ఒక పరిశ్రమను కాపాడటానికి ఇంత మొత్తం ఇవ్వడం ఇదే తొలి సారి అని శ్రీనివాసవర్మ చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని.. అలా అని సెయిల్‌లో విలీనం కూడా కాదని శ్రీనివాసవర్మ స్పష్టత ఇచ్చారు. నష్టాలను అధిగమించిన తర్వాత స్టీల్ ప్లాంట్‌ను అప్పగించాలని సెయిల్ చెప్పినట్లు ఆయన తెలిపారు. ఈ వారంలోనే ముడి సరుకు తీసుకువచ్చి స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. ఆగస్టు నెల చివరి వరకూ పూర్తి స్థాయి సామర్థ్యాన్ని పెంచుతామన్నారు. ఎలాగైనా సరే స్టీల్ ప్లాంట్‌ను నష్టాల ఊబిలో నుంచి బయటకు లాగుతామని శ్రీనివాస వర్మ హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed