మోహినీ అవతారంలో తిరుమలేశుడు...ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

by Seetharam |
మోహినీ అవతారంలో తిరుమలేశుడు...ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఐదో రోజు అయిన గురువారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఇకపోతే ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన అపూర్వ కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొత్తం 12 కళాబృందాల్లో 313 మంది కళాకారులు తమ నృత్యప్రదర్శనలు చేశారు. బిహు అనేది అస్సాం రాష్ట్ర సాంప్రదాయ జానపద నృత్యం. ఇది సాధారణంగా వసంత రుతువును స్వాగతిస్తూ యువతీ యువకులు ప్రదర్శించే నృత్యం. 25 మంది కళాకారుల బృందం డప్పుల దరువులకు అనుగుణంగా లయబద్ధమైన అడుగులతో ఈ నృత్యాన్ని ప్రదర్శించారు. మహారాష్ట్రకు చెందిన జానపద నృత్యం సోంగి ముఖోటాను పూణేకి చెందిన రాజి బృందం ప్రదర్శించింది. 25 మంది సభ్యులు 25 కిలోల బరువున్న రంగురంగుల దుస్తులు ధరించి చక్కగా ప్రదర్శించారు. అలాగే శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థుల మోహినీ అవతార నృత్య ప్రదర్శన భక్తులను సమ్మోహనపరిచింది. ఇకపోతే రాజమహేంద్రవరంకు చెందిన దుర్గా నాగమణి బృందం చేసిన డప్పు నృత్యం అందర్నీ ఆకట్టుకుంది.అలాగే హైదరాబాద్‌కు చెందిన అభిరామి బృందం ఒడిస్సీ నృత్యంతో అలరించారు. తెలంగాణ రాష్ట్రం, వరంగల్ ప్రాంతానికి చెందిన రాహుల్ బృందం కావడి నృత్యాన్ని ప్రదర్శించారు. ఇకపోతే రాజమండ్రికి చెందిన పి.సుమన్ డ్రమ్స్ విన్యాసాలు, కొత్తగూడెంకు చెందిన పి.వాసు బృందం కోలాటాల నృత్యం, దేవరపల్లికి చెందిన పి.రవితేజ బృందం గోపిక కృష్ణుడు వేషధారణతో భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.


సాయంత్రం గరుడవాహనంపై శ్రీవారి విహారం

సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహనంపై స్వామివారు విహరించనున్నారు. గరుడోత్సవానికి భక్తులు పెద్దఎత్తున తరలిరానున్న నేపథ్యంలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. గురువారం సర్వదర్శనం టోకెన్ల జారీని బుధవారం రాత్రి నుంచి రద్దు చేసింది.శ్రీవారి గరుడసేవ నేపథ్యంలో 3,400 మంది పోలీసులతో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశామని ఎస్పీ పరమేశ్వరరెడ్డి, టీటీడీ సీవీఎస్‌వో నరసింహకిశోర్‌ తెలిపారు

Advertisement

Next Story