ఏపీలో టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సే: తోట చంద్రశేఖర్

by GSrikanth |
ఏపీలో టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సే: తోట చంద్రశేఖర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్ర ప్రజ‌ల‌ను టీడీపీ, వైసీపీ పార్టీలు మోసం చేశారని, ఈ రెండు పార్టీల‌కు ప్రత్యామ్నాయం భార‌త రాష్ట్ర స‌మితి అని ఆపార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖ‌ర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌కు ఏపీలో ప్రజాధరణ వస్తుందని, టీడీపీ, వైసీపీ రెండు పార్టీల‌కు ప్రజ‌లు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు పట్టం కడితే ఏపీకి చెందిన వారే సీఎం అవుతార‌న్నారు. గుంటూరులోని ఆటోన‌గ‌ర్‌లో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాల‌యాన్ని ప్రారంభించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీని టీడీపీ, వైసీపీ పార్టీలు ఆథోగ‌తి పాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో అభివృద్ధి శూన్యం, అప్పులు ఘ‌నం అన్న చందంగా ఏపీ పరిస్థితి మారిందని మండిపడ్డారు.

ఆకాల వ‌ర్షాల‌తో అతలాకుత‌ల‌మైన రైతాంగానికి ప్రభుత్వం సాయ‌మందించ‌లేద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. 31 మంది వైసీపీ ఎంపీలు ఉన్నా ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిల‌దీసిన దాఖ‌లాలు లేవన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటు ప‌రం చేస్తుంటే ఏం చేశారని ప్రశ్నించారు. జ‌గ‌న్‌కు కేసుల భ‌య‌ం, చంద్రబాబు మోదీతో పొత్తుకు ప్రయ‌త్నాలు చేస్తున్నార‌ని ఈ రెండు పార్టీలకు ప్రజలు పాతర వేయాలని పిలుపునిచ్చారు. మోడీని దీటుగా ఎదుర్కొనే సత్తా కేసీఆర్‌కు మాత్రమే ఉందన్నారు. కేసీఆర్ ఒక్క తెలంగాణ‌, ఏపీ, మ‌హారాష్ట్రాల‌కే కాద‌ని దేశం మొత్తానికి నాయ‌క‌త్వం వ‌హిస్తార‌ని ధీమా వ్యక్తం చేశారు. రైతు బీమా, రైతు బంధు ప‌థ‌కాలు దేశ వ్యాప్తంగా రైతుల ఆద‌ర‌ణ‌ను పొందాయని, దేశంలోనే సీనియ‌ర్ నేత‌గా చెప్పుకునే చంద్రబాబుకు ఏనాడైనా ఇలాంటి ఆలోచ‌న త‌ట్టిందా..? అని ప్రశ్నించారు. తెలంగాణ మోడ‌ల్ అభివృద్దిని ఏపీ ప్రజ‌లు కోరుకుంటున్నారన్నారు.

రానున్న కాలంలో బీఆర్ఎస్ ఏపీలో రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించ‌నుంద‌ని స్పష్టం చేశారు. తెలంగాణ మోడల్‌ను దేశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో 35శాతం నిరుద్యోగం పెరిగిందని, పెట్టుబడులు రావడం లేదన్నారు. అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా జగన్ మార్చారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story