షర్మిలతో వైఎస్ జగన్‌కు నష్టం తప్పదా.. విశ్లేషకులు ఏమంటున్నారంటే.. ?

by srinivas |
షర్మిలతో వైఎస్ జగన్‌కు నష్టం తప్పదా.. విశ్లేషకులు ఏమంటున్నారంటే.. ?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో అన్నిపార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. మరోవైపు ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కసరత్తులు ప్రారంభించారు. వైఎస్ జగన్‌ను ఓడించి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు అస్తశస్త్రాలు రెడీ చేస్తున్నారు. అందివచ్చిన పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఎలాగైనా సరే గట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో మరోపార్టీ కూడా రేసులోకి వస్తోంది. రాష్ట్ర విభజన పుణ్యమా అంటూ రాష్ట్రంలో కనుమరైన కాంగ్రెస్ పార్టీ కూడా బరిలోకి దిగుతోంది. కర్ణాటక, తెలంగాణలో అమలు చేసిన వ్యూహాలను రాష్ట్రంలోనూ అమలు చేయాలని భావిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర స్థాయిలో చెప్పుకునే గట్టి నేతల లేరు. దీంతో వైఎస్ షర్మిలవైపు కాంగ్రెస్ చూస్తోంది. 2019 ఎన్నికల్లో అన్న వదిలిన బాణంలా షర్మిల పని చేశారు. అన్నను సీఎంను చేశారు. ఆ తర్వాత పార్టీలో సరైన గౌరవం దక్కకపోవడంతో షర్మిల తెలంగాణకు షిప్ట్ అయ్యారు. వైఎస్సార్టీపీని స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా ఆమె పాదయాత్ర చేపట్టారు. తెలంగాణ కొంత బలం పెంచుకున్నారు. ఒకనొక సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో షర్మిల చేరబోతున్నరని, పార్టీని విలీనం చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. తెలంగాణ ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేయాలని భావించారు. చివరకు కాంగ్రెస్ మద్దతు పలికి ఎన్నికల్లో పోటీ చేయలేదు.


దీంతో ఆమె సేవలను ఏపీలో ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది. ఏపీ పీసీసీ చీఫ్ పదవిని షర్మిల ఇస్తే ఎలా ఉంటుందనే అంచనాలు కూడా వేస్తోందట. అటు అన్న జగన్‌కు కూడా చెక్ పెట్టినట్లు అవుతుందని భావిస్తోందట. కాంగ్రెస్ అనుకున్నట్టుగానే వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్‌లో చేరితే సీఎం జగన్‌కు ఎఫెక్ట్ తప్పదా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. వైఎస్ షర్మిలకు రాజశేఖర్‌రెడ్డి కూతురిగా, వైఎస్ జగన్‌కు చెల్లెలిగా ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు వైసీపీని షర్మిలనే కాపాడారనే భావన ఉంది. ఆమెది రాయలసీమ. అంతేకాకుండా షర్మిలది బలమైన సామాజికవర్గంతో పాటు, భర్త అనిల్ ఓ మతానికి ప్రచార సారథిగా కూడా ఉన్నారు. దీంతో ఆయా అంశాలు కాంగ్రెస్‌ పార్టీ కలిసి వస్తాయని భావిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఓట్లు భారీగా పడే అవకాశం ఉంది. పైగా 2014లో కన్నా 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఓట్లు పడ్డాయి. ఇప్పుడు డైరెక్ట్ గా వైఎస్ షర్మిల అధ్యక్షతన ఎన్నికలకు వెళ్తే రాష్ట్రంలో బలం పెరుగుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. వైఎస్ షర్మిల పోటీ చేస్తే ఆ నియోజకవర్గంలో కచ్చితంగా గెలుస్తుందని, బలమైన నేతలను బరిలోకి దింపితే మరి కొన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించవచ్చని భావిస్తోంది.

అయితే వైఎస్ షర్మిల గాని నిజంగా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా బరిలోకి దిగితే వైఎస్ జగన్‌ కు ఓటు బ్యాంక్ తగ్గే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వైఎస్ పై ఉన్న అభిమానంతో చాలా మంది నేతలు, కార్యకర్తలు జగన్ వెంట నడిచి అధికారంలోకి వచ్చే వరకు కృషి చేశారు. ఇప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్ బరిలో ఉంటే వైఎస్ అభిమానులు, సొంత సామాజిక వర్గం నేతల ఓట్ల చీలే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు జగన్‌పై కొన్ని ప్రాంతాల్లో సొంత నేతలే వ్యతిరేకిస్తుండటంతో వైసీపీకి పడాల్సిన ఓట్లు వైఎస్ షర్మిల వల్ల కాంగ్రెస్‌కు టర్న్ అయ్యే అవకాశాలున్నాయని మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. ఏ విధంగా చూసుకున్నా వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీకి బలం పెరగడంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొంత ఓటు బ్యాంకింగ్ దూరమయ్యే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి జరుగుతుందో చూడాలి.

Advertisement

Next Story