సీఎం జగన్‌కు బిగ్ షాక్.. సీబీఐకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు..!

by Satheesh |   ( Updated:2023-11-03 06:06:20.0  )
సీఎం జగన్‌కు బిగ్ షాక్.. సీబీఐకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు..!
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వైసీపీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామ రాజు వేసిన పిటిషన్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నెమ్మదిగా సాగుతోందని.. ఈ కేసు దర్యాప్తును తెలంగాణ నుండి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూఎంపీ రఘురామ రాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేసులో ప్రతివాదిగా ఉన్న కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందని సీబీఐని ప్రశ్నించింది.

విచారణను ఇంకో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను ఎందుకు విచారణకు స్వీకరించకూడదో చెప్పాలని న్యాయస్థానం కోరింది. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు జనవరికి వాయిదా వేసింది. గత కాలంగా నెమ్మదిగా సాగుతోన్న జగన్ ఆస్తుల కేసు విచారణ వ్యవహారం రఘురామ పిటిషన్‌తో మరోసారి తెరపైకి వచ్చింది. ఏకంగా సుప్రీంకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. దర్యాప్తు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో సీబీఐ విచారణలో దూకుడు పెంచితే ఎన్నికల వేళ సీఎం జగన్‌కు భారీ ఎదురు దెబ్బ అనే చెప్పవచ్చు.

Advertisement

Next Story