‘కేంద్రం ఇచ్చే నిధుల్ని కూడా దారి మళ్లించారు’.. గత ప్రభుత్వ పాలన పై మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
‘కేంద్రం ఇచ్చే నిధుల్ని కూడా దారి మళ్లించారు’.. గత ప్రభుత్వ పాలన పై మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ మేరకు విజయవాడ భారతి నగర్ 3వ లైన్‌లో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.14 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణానికి చొరవ తీసుకున్న స్థానిక కార్పొరేటర్ సాంబశివరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత పాలకులు విజయవాడ నగరాన్ని అభివృద్ధికి దూరం చేశారని, కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. వారి పాపాల కారణంగానే బుడమేరు వరదలతో విజయవాడ నగరం అతలాకుతలం అయిందన్నారు. బుడమేరు కాలువ గట్లపై నుంచి మట్టి తవ్వుకుని అమ్ముకున్నారని ధ్వజమెత్తారు.

అంత పెద్ద స్థాయిలో వరదలు ముంచెత్తినా.. తన కార్యదక్షత, చొరవతో పది రోజుల్లో నగరం మొత్తాన్ని యథా స్థితికి తీసుకొచ్చారు. ఎప్పుడూ ఎక్కడా ఏ ఒక్కరూ ఇవ్వని విధంగా బాధిత కుటుంబాలకు ప్యాకేజీ ఇచ్చారు. గత పాలకులు 15వ ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించారు. రోడ్లు, డ్రైనేజీలు గాలికి వదిలేశారు. కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని జగన్ రెడ్డి అండ్ కో నాశనం చేసింది. కానీ ఈ రోజు మాత్రం పిలిస్తే పలికే ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నిర్మాణాలు, అభివృద్ధికి శ్రీకారం చుట్టామని తెలిపారు. కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకొస్తున్నాం. అమృత్ పథకం కింద నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

అమరావతి గురించి కొంత మంది చేతకాని దద్దమ్మలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా ఇవ్వని కారణంగా పనులు నిలిచిపోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే సుమారు రూ.50 వేల కోట్లతో అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసి చూపిస్తుంది. ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన గుంతల పూడ్చివేత చేపట్టాం. రోడ్ల నిర్మాణాలు చేస్తున్నాం. సంక్రాంతి నాటికి గుంతలు రహిత రాష్ట్రం లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. త్వరలోనే ఇళ్ల నిర్మాణాలకు కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. ఆరు నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. పెట్టుబడులు తీసుకొస్తాం. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story