మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతా...నా అసలు రూపం చూపిస్తా: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Seetharam |   ( Updated:2023-12-27 09:43:43.0  )
మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతా...నా అసలు రూపం చూపిస్తా: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘నాలుగు నెలల తర్వాత నా అసలు రూపం చూపిస్తా. ఎన్నికల తర్వాత మళ్లీ పాతకేతిరెడ్డిని చూస్తారు. మళ్లీ ఫ్యాక్షన్ మెదలుపెడతా’ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ఫ్యాక్షన్ మెుదలు పెడతానని హెచ్చరించారు. 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తన ప్రత్యర్థులను వదిలిపెట్టే ప్రసక్తేలేదని కేతిరెడ్డి పెద్దారెడ్డి హెచ్చరించారు.అనంతపురంలో బుధవారం కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాడిపత్రి మున్సిపల్ చైర్‌పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులు తాను దోచేస్తున్నాననంటూ తనపైన కరపత్రాలు వేసి అసత్య ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. తన రాజకీయ ఉనికి కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న చీడ పురుగులను ఏరేస్తానని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు.


జేసీవి బ్లాక్‌మెయిల్ రాజకీయం

జేసీ ప్రభాకర్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తాడిపత్రి మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధం అని ఛాలెంజ్ చేశారు. బినామీ పేర్లతో తాడిపత్రి మున్సిపల్ ఆస్తులను జేసీ కొల్లగొట్టారు అని ధ్వజమెత్తారు. జేసీ వర్గీయులు సైతం అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఇకపై జేసీ కానీ, ఆయన అనుచరులు కానీ నోరు జారితే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు. జేసీ వర్గీయులు ఇకపై తన ఓర్పును పరీక్షించవద్దు అని హెచ్చరించారు. తాడిపత్రిలో గొడవలు సృష్టించి సానుభూతి పొందేందుకు కుట్రలు చేస్తున్నారని... అందుకు తప్పుడు విధానాలను అవలంభిస్తున్నారని విరుచుకుపడ్డారు. తనపై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే సహించేది లేదని ఏరిపారేస్తానంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story