సంచలనంగా డ్రగ్స్ కంటైనర్ వ్యవహారం.. వివరణ ఇచ్చుకోలేక వైసీపీ అవస్థలు

by GSrikanth |
సంచలనంగా డ్రగ్స్ కంటైనర్ వ్యవహారం..  వివరణ ఇచ్చుకోలేక వైసీపీ అవస్థలు
X

సంపూర్ణ మద్య నిషేధం అమలుచేసి 2024 ఎన్నికల్లో ఓటు అడుగుతానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్.. ఆ తర్వాత మద్యనిషేధం మాటే మర్చిపోయారు. అంతేకాదు, రాష్ట్రాన్ని డ్రగ్స్ తో నింపేశారు. దశలవారీ మద్య నిషేధం అని చెప్పి అందుకోసమే మద్యం ధరలు విపరీతంగా పెంచుతున్నామని ప్రకటించి నాసిరకం బ్రాండ్లను ప్రజలకు అంటగట్టారు. వారి ప్రాణాలతో చెలగాటమాడారు. అస్తవ్యస్త మద్య విధానానికి తోడు ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేయడంతో గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో గంజాయి విజృంభించింది. ఇప్పడు ఏకంగా వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ఏపీ చిరునామాలతో దిగుమతి అవుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాష్ట్రం పరువు పోతోంది.

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: దశలవారీ సంపూర్ణ మద్య నిషేధం నినాదంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. దానిని అమలు చేస్తున్నామని మభ్యపెట్టి ప్రముఖ బ్రాండ్ లన్నింటినీ తరిమేసింది. పార్టీ ముఖ్య నేతల చేతుల్లోకి డిస్టలరీలు వచ్చిన తరువాత నాసిరకం బ్రాండ్ల ఉత్పత్తి, పంపిణీలను ప్రారంభించి ధరలను విపరీతంగా పెంచింది. మద్యం షాపులను ప్రభుత్వమే నడుపుతూ డిజిటల్ పేమెంట్స్ లేకుండా వేల కోట్ల అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన బ్రాండ్లు నాసిరకానివని, ప్రజల ప్రాణాలను తీస్తున్నాయని ప్రతిపక్షాలు ఎంత గోల చేసినా పట్టించుకోలేదు. నాసిరకం మద్యం తాగలేక, ఇక్కడి ధరలు భరించలేక జనం పక్క రాష్ట్రాలనుంచి మద్యం తెచ్చుకొంటుంటే సరిహద్దుల్లో మద్యం చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు, కేసుల పేరిట నరకం చూపించారు. కొత్తగా వచ్చిన బ్రాండ్లన్నీ వైసీపీ ముఖ్యనేతలు, వారి బంధువులవే కావడం గమనార్హం. డిస్టలరీల నుంచి అధిక ధరలకు మద్యం కొనడం వెనుక వేల కోట్ల అవినీతి ఉందనే ఆరోపణలొచ్చినా ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయలేదు.

మద్యం కొనలేక.. గంజాయి బాట..

ప్రజలను మద్యం నుంచి దూరం చేసే పేరిట ధరలు విపరీతంగా పెంచడం, ప్రజలకు అలవాటైన బ్రాండ్లను మార్కెట్లో లేకుండా చేయడం, బార్లలో ధరలు మరీ ఎక్కువ కావడంతో సామాన్య జనం, యువత గంజాయి వైపు మళ్లారు. ఎక్సైజ్ శాఖను ప్రభుత్వం నిర్వీర్యం చేసి సెబ్ పేరిట కొత్త విభాగాన్ని ప్రారంభించడంతో ఎక్సైజ్ శాఖలోని కీలక అధికారులంతా డిప్యూటేషన్ పై ఇతర శాఖలకు వెళ్లిపోయారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో గంజాయి నిర్మూలనకు ఏర్పాటైన ప్రత్యేక విభాగం రద్దయిపోయింది. గంజాయి పెంపకంపై నియంత్రణ లేకుండా పోయింది.

గంజాయి అడ్డాలుగా.. విద్యాసంస్థలు..

ప్రభుత్వ అసమర్థత కారణంగా విద్యాసంస్దలు గంజాయి అడ్డాలుగా మారాయి. పలు విద్యాసంస్దలలో ప్రత్యేకంగా గంజాయి బ్యాచ్ లు ఏర్పడి ఘర్షణలు తలెత్తాయి. ఇటీవల ఆంధ్రా విశ్వవిద్యాయలం హాస్టల్లో గంజాయితో విద్యార్దుల దొరికిపోగా, ఒంగోలు వైద్య కళాశాలలో గంజాయి కారణంగా విద్యార్దులు రెండు గ్రూపులుగా విడిపోయి రక్తమొచ్చేలా కోట్టుకొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి కారణంగా శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బతిని హత్యలు పెరిగాయని పోలీసు అధికారులే అంగీకరించే దుస్ధితి నెలకొంది. గత ఐదేళ్ల కాలంలో వేల కోట్ల విలువ చేసే గంజాయి దొరికింది. ఇతర రాష్ట్రాల్లో దొరికే గంజాయికి ఏపీనే కేంద్రం కావడంతో పలు రాష్ట్రాల పోలీసుల ఇక్కడకు వచ్చి విచారణ జరిపారు. శుక్రవారం కూడా భద్రచలం వద్ద ఆంద్రా నుంచి వెలుతున్న 16 లక్షల విలువైన గంజాయిని పట్టుకొన్నారు.

దిగుమతులు ఇక్కడికే..

రాష్ట్రంలో గంజాయితో పాటు డ్రగ్స్ వినియోగం కూడా పెరిగింది. పోలీసు దాడుల్లో పలుచోట్ల డ్రగ్స్ పెద్ద ఎత్తున లభ్యమయ్యాయి. గతంలో గుజరాత్ ముంద్రా పోర్టులో రూ.25 వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకొన్నారు. పౌడర్ పేరిట దిగుమతి అయిన ఆ డ్రగ్స్ విజయవాడ చిరునామాతో బుక్ కావడం సంచలనం సృష్టించింది. తాజాగా విశాఖ పోర్టులో పట్టుబడిన రూ. 50 వేల కోట్లు విలువ చేసే డ్రగ్స్ ను విశాఖకు చెందిన సంధ్యా ఆక్వా సంస్ధ దిగుమతి చేసుకొంది. ఆ సంస్ద యజమాని కూనం వీరభద్రరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కావడం చర్చనీయాంశమైంది. ఇంటర్ పోల్ ఇచ్చిన సమాచారంతో సీబీఐ జరిపిన దాడుల్లో ఇది బయటపడింది. ఎటువంటి సమాచారం, సీబీఐ దాడులు లేకుండా గతంలో ఎన్ని వేలు, లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ దిగుమతి అయ్యాయో అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

భుజాలు తడుముకొంటున్నారు..

రూ. 50 వేల కోట్ల గంజాయిని సీబీఐ అధికారులు పట్టుకొనే క్రమంలో వారికి సహకరించాల్సిన రాష్ర్ట పోలీసులు అందుకు విరుద్దంగా జాప్యం చేశారంటూ వచ్చిన వార్తలు ఏపీ పోలీసు వ్యవస్దకే మచ్చ తెచ్చాయి. ఒకప్పుడు దేశంలోనే ఉత్తమ పోలీసుగా కీర్తిపొందిన ఏపీ పోలీసులు ఇప్పుడు దిగజారిపోయారనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై వివరణ ఇవ్వడానికి ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన విశాఖ సీపీ రవిశంకర్.. విశాఖను డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చడమే లక్ష్యం అంటూ ఊకదంపుడు ఉపన్యాసమిచ్చారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే అంశంపై మాట్లాడుతూ యథావిధిగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వం డ్రగ్స్ విషయంలో ఎందుకు కఠినంగా వ్యవహరించలేకపోతున్నదో స్పష్టంగా చెప్పలేకపోయారు. సోషల్ మీడియా దెబ్బకు వైసీపీ ఐటీ వింగ్ మూగబోయింది. ఈ అంశం గురించి మాట్లాడకుండా తెలుగుదేశం హయాంలో గంజాయి దొరికిన వీడియోలు, ఫొటోలతో కాలక్షేపం చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed