టీడీపీకి కొత్త బాస్: నారా బ్రాహ్మణికి ట్రైనింగ్... టాస్క్ పూర్తి చేసేనా?

by Seetharam |   ( Updated:2023-09-28 08:43:31.0  )
టీడీపీకి కొత్త బాస్: నారా బ్రాహ్మణికి ట్రైనింగ్... టాస్క్ పూర్తి చేసేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును మరికొన్ని రోజులు జైల్లోనే ఉంటారా? టీడీపీ యువనేత నారా లోకేశ్‌ను సైతం అక్టోబర్ 3 తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? చంద్రబాబు, లోకేశ్‌లను కొన్ని రోజులపాటు జైల్లోనే ఉంచాలనే ఆలోచన వైసీపీ పెద్దల వ్యూహమా? లోకేశ్, చంద్రబాబు అరెస్ట్‌తో పార్టీ పగ్గాలు ఎవరి చేపట్టబోతున్నారు? నారా బ్రాహ్మణికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే వార్తల్లో ఏమాత్రం వాస్తవం ఉంది? గత 10 రోజులుగా నిరసనలలో పాల్గొన్న నారా బ్రాహ్మణి అకస్మాత్తుగా తెరవెనక్కి వెళ్లిపోవడానికి కారణం ఏమిటి? పొలిటికల్ అంశాలపై నారా బ్రాహ్మణికి శిక్షణ ఇస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. నారా బ్రాహ్మణి రాబోయే రోజుల్లో టీడీపీకి పెద్ద అసెట్ కాబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే చంద్రబాబు జైల్లో ఉన్నారు. అక్టోబర్ 3 తర్వాత లోకేశ్ సైతం అరెస్ట్ అవుతారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీకి వచ్చే సానుభూతిని కాపాడుకోవడంతోపాటు పార్టీకి జవసత్వాలు అందిచేందుకు నారా బ్రాహ్మణిని పార్టీ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆమెకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు, లోకేశ్ జైలు నుంచి బయటకు వచ్చేలోపు టీడీపీలో వేవ్ తీసుకువచ్చేలా నారా బ్రాహ్మణిని టీడీపీ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీలో ఉక్కిరిబిక్కిరి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబ నాయుడు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అవ్వడం ఆ పార్టీకి పెద్ద మైనస్‌గా మారింది. తెలుగుదేశం పార్టీకి కుటుంబ పెద్దగా వ్యవహరిస్తూ దిశానిర్దేశం చేసే చంద్రబాబు నాయుడు ఇలా ఎన్నికలకు ముందు జైలుపాలవ్వడం ఆ పార్టీ నేతల్లో ఆందోళనలకు దారి తీస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం జరిగిన సర్వేలలో టీడీపీకి ఓటు బ్యాంక్ పెరిగిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అంతేకాదు ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో టీడీపీ పట్ల, చంద్రబాబు నాయుడు పట్ల విపరీతమైన సానుభూతి పెరిగిందని తెలిపింది. మరోవైపు న్యూట్రల్‌గా ఉన్న ఓటర్లలో 4 శాతం మందిలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ వారంతా ఇప్పుడు టీడీపీ వైపు ఆకర్షితులైనట్లు మరో సర్వే చెప్తోంది. ఇదిలా ఉంటే చంద్రబాబు అరెస్ట్ అనంతరం నారా లోకేశ్ పార్టీ బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను జాతీయస్థాయిలో తెలియజేసేందుకు, న్యాయపరమైన సూచనలు, సలహాల కోసం లోకేశ్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇటు ఏపీలో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ పార్టీ వ్యవహారాలను చక్కబెడుతుంది. ఇదిలా ఉంటే నారా లోకేశ్‌‌ను ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంల్ ఏ-14గా సీఐడీ చేర్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ సైతం నారా లోకేశ్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారించాల్సి ఉంది.

లోకేశ్ అరెస్ట్ అయ్యే చాన్స్

ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడుకు ఇప్పట్లో బెయిల్ వచ్చే దాఖలాలు కనిపించడం లేదు. సీఐడీ ఒకదానిపై ఒకటి పిటిషన్లు వేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మరోవైపు నారా లోకేశ్‌ను సైతం సీఐడీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చంద్రబాబు నాయుడు మెడ చుట్టూ ఇప్పటికే స్కిల్ స్కాం కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఉంది. అనంతరం అంగళ్లు కేసు కూడా ఉంది. అలాగే విజయనగరంలో ఓ కేసును చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్నారు. అలాగే నారా లోకేశ్ ఇన్నర్ రింగ్ రోడ్, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులను ఎదుర్కోబోతున్నారు. అయితే వైసీపీ నేతలు, మంత్రులు స్కిల్ స్కాం కేసులో లోకేశ్‌ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. ఇలా అటు తండ్రి చంద్రబాబు నాయుడు ఇటు తనయుడు లోకేశ్‌ల విషయంలో రకరకాల కేసులను తెరపైకి తెచ్చి వీలైనన్ని రోజులు జైలులో ఉంచాలన్నదే వైసీపీ పెద్దల వ్యూహం అన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా సీఐడీ కార్యచరణ సైతం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నారా లోకేశ్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఐఆర్ఆర్, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులలో అరెస్ట్ చేసి జైలుకు పంపుతారనే ప్రచారం జరుగుతుంది. ఇదే జరిగితే టీడీపీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినడం ఎలా ఉన్న సానుభూతి మాత్రం మరింత పెరుగుతుందనే ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తోనే సానుభూతి పెరిగిందని.. అలాగే లోకేశ్ అరెస్ట్ అయితే అది మరింత రెట్టింపు అవుతుందనే ప్రచారం ఉంది.

తెరపైకి బ్రాహ్మణి

నారా చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లు అరెస్ట్ అయితే ప్రజల్లో విపరీతంగా సానుభూతి పెరుగుతుందని టీడీపీ భావిస్తోంది. ఇప్పటికే భువనేశ్వరి, నారా లోకేశ్‌లు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేసినట్లే. నారా భువనేశ్వరి టీడీపీ దీక్షా శిబిరాల వద్దకు వెళ్తున్నప్పుడు ఆమెకు విపరీతమైన ఆదరణ వస్తుంది. అన్న నందమూరి తారక రామారావు కుమార్తె కావడం అందులోనూ చంద్రబాబు భార్య కావడంతో ఎప్పుడు ఇంటి నుంచి బయటకు రాని ఆమె బయటకు రావడం.. కంట తడి పెట్టడం చూసి చాలా మంది అయ్యోపాపం అంటున్నారు. ఇలా ఆమెపట్ల కూడా టీడీపీ శ్రేణులతోపాటు సామాన్యుల్లోనూ కాస్త సానుభూతి వ్యక్తమవుతుంది. ఆ సానుభూతిని కాపాడుకునేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా నారా బ్రాహ్మణిని తెరపైకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నందమూరి ఆడపడుచుగా.. నారా వారి కోడలుగా బ్రాహ్మణిని ప్రజలు ఆదరిస్తారు. నటసింహం బాలయ్య కుమార్తె కావడంతో అటు నుంచి అభిమానుల ఆదరాభిమానాలు సైతం బ్రహ్మణికి ఉన్నాయి. అందులోనూ సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్. అడ్మినిస్ట్రేషన్ నారా బ్రాహ్మణికి బాగా తెలుసు అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అటు చంద్రబాబు ఇటు లోకేశ్ అరెస్ట్ అయితే నారా బ్రహ్మణిని ముందు ఉంచి తెరవెనుక టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీతో నడిపించాలని వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ శ్రేణులు బ్రాహ్మణిని ఓన్ చేసుకున్నట్లు రాజకీయ వర్గాల నుంచి తెలుస్తోంది. అలాగే ఐటీ దిగ్గజాలు, ఇతర పార్టీల నేతలు సైతం బ్రాహ్మణితోనే టచ్‌లో ఉంటూ ఆమెను కలుస్తున్నారు. దీంతో ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే బెటర్ అనే ప్రచారం జరుగుతుంది.

టీడీపీలో కీలకంగా బ్రాహ్మణి

ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం నారా బ్రాహ్మణి రాజమహేంద్రవరంలో ఉంటున్నారు. అయితే ఆకస్మాత్తుగా ఆమె కనిపించకుండా పోయారు. భువనేశ్వరి మాత్రమే పర్యటిస్తున్నారు. దీంతో అంతా భువనేశ్వరి బిజినెస్‌లో బిజీ అయ్యారనే ప్రచారం జరుగుతుంది. కానీ అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. బ్రాహ్మణిని రాజకీయంలో శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా ఎలా మాట్లాడాలి.. తెలుగు భాషపై పట్టు వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. 30 రోజుల్లో నారా బ్రాహ్మణికి అన్ని అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక టీంను సైతం నియమించినట్లు తెలుస్తోంది. ఈ శిక్షణలో నారా బ్రాహ్మణి బిజీగా ఉన్నారని అందువల్లే బయటకు రావడం లేదని తెలుస్తోంది. మెుత్తానికి ఏది ఏమైనప్పటికీ నారా బ్రాహ్మణి పొలిటికల్ ఆరంగేట్రానికి రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో టీడీపీలో క్రియాశీలకం కాబోతున్నారనే ప్రచారం పార్టీతోపాటు బయట కూడా జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed