Sharmila : ఏపీ అభివృద్ధికి హోదానే శరణ్యం : షర్మిల

by Y. Venkata Narasimha Reddy |
Sharmila : ఏపీ అభివృద్ధికి హోదానే శరణ్యం : షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్ : ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రానికి సంజీవని ప్రత్యేక హోదా(Special Status) అని..హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని..నిధులు పారాలన్నా.. పరిశ్రమలు స్థాపన జరగాలన్నా.. ప్రజల ఆదాయం పెరగాలన్నా.. యువతకు ఉద్యోగాలు రావాలన్నా.. హోదా ఒక్కటే శరణ్యమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల(Sharmila)స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు వైఖరి " ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న’’ సామెతను తలపిస్తోందని షర్మిల ఎక్స్ వేదికగా మండిపడ్డారు.

ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసిన చంద్రబాబు అమలుకొచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడతపేచి పెట్టారని విమర్శించారు. అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని, మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెప్తున్నారని..ఆడలేక మద్దెల దరువన్నట్లుంది బాబు వ్యవహారమని దుయ్యబట్టారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చే ముందు తెలియదా రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నామన్నారు.

సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటే తెలియదా ఏటా రూ.2 లక్షల కోట్లు అవసరం ఉందని..? రాష్ట్ర బడ్జెట్ మొత్తం డైవర్ట్ చేసినా ఇంకా నిధుల కొరత ఉంటుందని తెలియదా..? కేంద్రానికి మీరొక్కరే కాదని తెలిసినప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చారని షర్మిల నిలదీశారు. రాష్ట్రానికి సహాయ పడనప్పుడు ప్రధాని మోడీతో చెట్టాపట్టాలు దేనికోసమని ప్రశ్నించారు. ప్రజలు ఓట్లేసి అధికారం ఇస్తే, ఏదో ఉద్ధరిస్తారని నమ్మకం పెట్టుకుంటే, హామీలను తుంగలో తొక్కి, విజన్ల పేరుతో , వృద్ధి రేట్ల సాకుతో కాలయాపన తప్పా.. చంద్రబాబు పనితనం శూన్యమని షర్మిల విమర్శించారు.

Next Story

Most Viewed