Focus on Election: ఎన్నికల మూడ్‌లోకి సీఎం జగన్.. తొలి అభ్యర్థి ప్రకటన

by srinivas |   ( Updated:2023-04-19 16:33:02.0  )
Focus on Election: ఎన్నికల మూడ్‌లోకి సీఎం జగన్.. తొలి అభ్యర్థి ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయారా? అభ్యర్థుల ప్రకటనకు రెడీ అయ్యారా? మరో ఏడాది సమయం మాత్రమే ఉండటంతో ఎన్నికల ప్రచారానికి సైతం సై అంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అందుకు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం మూలపేటలో శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. నౌపడలో జరిగిన సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ఎన్నికల సమరాన్ని తలపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఓటు బ్యాంకును క్యాష్ చేసుకునేందుకు కీలకమైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అలాగే ఎన్నికలమూడ్‌లోకి వెళ్ళిపోయినట్లు సంకేతాలు సైతం ఇచ్చేశారు. ఇతర పార్టీలపై విమర్శల దాడి చేశారు. అదే సందర్భంలో టెక్కలి నియోజకవర్గం అభ్యర్థిని సైతం ప్రకటించేశారు. ఇదే సందర్భంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఆదరించాలని కూడా సీఎం జగన్ కోరారు. సీఎం జగన్ ప్రసంగాన్ని పరిశీలిస్తే ఇక సీఎం జగన్ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయారని తెలుస్తోంది.

సమరానికి సై

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికలకు సై అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలతో దూకుడు పెంచారు. అయితే తాజాగా సీఎం జగన్ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని నౌపడ బహిరంగ సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా తెలుస్తోంది. వైనాట్ 175 అనే నినాదంతో సీఎం వైఎస్ జగన్ ఎన్నికలకు వెళ్లనున్నారు. అంతేకాదు అభ్యర్థుల ప్రకటనకు కూడా సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది. పీకే సర్వేతోపాటు ఇతర సర్వేలను సైతం సీఎం జగన్ పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు కోడి కత్తికేసు, వైఎస్ వివేకా హత్యకేసు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడటం, ప్రతిపక్ష తెలుగుదేశం దూకుడు పెంచడంతో ఇక ఎన్నికల సమరంలో సీఎం వైఎస్ జగన్ దూకేసినట్లు తెలుస్తోంది.

కలిసొచ్చిన ఏప్రిల్ ప్రకటన

2019 ఎన్నికలు ఏప్రిల్ 11న జరిగాయి. మే 23న ఫలితాలు వెల్లడయ్యాయి. బుధవారం ఏప్రిల్ 19 అంటే దాదాపు ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. ఈ ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరిగినా.. ప్రకటన చేపట్టినా అది కలిసివస్తుందని సీఎం జగన్ భావించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎన్నికలకు సై అన్నట్లుగా ఇండికేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. 2024 ఎన్నికలకు రాజధాని అనేది లేకుండా వెళ్లడం కష్టం కాబట్టి విశాఖనే పరిపాలన రాజధానిగా ప్రకటించారు. సెప్టెంబర్ నుంచి కాపురం కూడా పెడతానని బహిరంగ ప్రకటన చేయడం వెనుక ఉద్దేశం మూడు రాజధానుల అంశమే ఎన్నికలప్రధాన అస్త్రం అని పరోక్షంగా సీఎం జగన్ తెలియజేశారు. జూలైలో రాజధాని అంశంపై కోర్టులో విచారణ జరగనుంది. సెప్టెంబర్‌లోగా విశాఖ పరిపాలన రాజధానిగా లీగల్ ఇస్యూస్‌ని అన్నింటిని అధిగమించి సెప్టంబర్ నుంచి పరిపాలన మొదలు పెట్టడానికి సీఎం జగన్ సన్నద్ధమైపోయినట్లు తెలుస్తోంది.

టెక్కలి అభ్యర్థిగా దువ్వాడ ప్రకటన

ఇప్పటి వరకు ఎమ్మెల్యే అభ్యర్థులను సీఎం జగన్ ఎక్కడా ప్రకటించలేదు. కానీ తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలో అభ్యర్థిని ప్రకటించారు. అందుకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నౌపడ బహిరంగ సభను సీఎం వైఎస్ జగన్ వేదికగా మార్చుకున్నారు. టెక్కలి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను ప్రకటించారు. టెక్కలి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ బరిలో ఉంటారని ప్రకటించారు. దువ్వాడ శ్రీనివాస్‌కు అండగా ఉండాలని.. గెలిపించాలని సీఎం జగన్ కోరారు. ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ సాగునీటి కోసం రూ.70కోట్లతో చేపట్టాల్సిన పనులకు సీఎం జగన్ గ్రాంట్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. టెక్కలి వైసీపీ అభ్యర్థిగా ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దని తేల్చి చెప్పేశారు. కన్ఫ్యూజన్ ఉంటే నష్టపోతామని ఇక అలాటి పరిస్థితి ఉండకూడదని తేల్చి చెప్పేశారు.దువ్వాడ శ్రీనివాస్‌కు వచ్చే ఎన్నికల్లో టికెట్ అని సీఎం జగన్ క్లారిటీ ఇచ్చేశారు. ఇకపోతే టెక్కలి నియోజకవర్గం నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ అచ్చెన్నాయుడుగా టెక్కలి ఎన్నికలు జరగనున్నాయి.

విమర్శల్లో వేడి పెంచిన జగన్

ఇకపోతే ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీలపై సీఎం వైఎస్ జగన్ విమర్శల దాడిలో స్పీడు పెంచారు. నౌపడ బహిరంగ సభలో రెచ్చిపోయి మరీ విమర్శలు చేశారు. ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పి అదే నిజమని నమ్మించే చీకటి యుద్ధం రాష్ట్రంలో జరుగుతుందని జగన్ ఆరోపించారు. పేదల పక్షాన నిలబడ్డ మీ బిడ్డకు, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న వారికి మధ్య యుద్ధం జరుగుతుందని సీఎం జగన్ సభలో వెల్లడించారు. వారి మాదిరిగా మీ బిడ్డకు ఎల్లో మీడియా లేవని, దత్తపుత్రుడు లేడంటూ సెటైర్లు వేశారు.ఈ యుద్ధంలో నా ధైర్యం మీరు.. ఈ యుద్ధంలో నా నమ్మకం మీరు. ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరు. మీ బిడ్డ నమ్ముకున్నది.. దేవుడి దయ, మీ చల్లని దీవెనలు అని సీఎం జగన్ స్పష్టం చేశారు. తోడేళ్లంతా ఒక్కటవుతున్నాయి. ఈ అబద్ధాలను నమ్మకండి. వారి మాదిరిగా అబద్ధాలు చెప్పే అలవాటు మీ బిడ్డకు లేదు. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగిందనుకుంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడండి అని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి:

వైసీపీలోకి టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు?

Bejawada: అన్నసీటుపై కన్నేసిన తమ్ముడు

స్టీల్‌ప్లాంట్‌ను నేనే కొనేస్తా : కేఏ పాల్‌

Advertisement

Next Story