అశ్రునయనాలతో సీఐ మల్లి నాగేశ్వరరావు అంతిమయాత్ర

by Javid Pasha |
అశ్రునయనాలతో సీఐ మల్లి నాగేశ్వరరావు అంతిమయాత్ర
X

దిశ, చీరాల : సోమవారం మధ్యాహ్నం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో విధి నిర్వహణలో ఉన్న సీఐ మల్లి నాగేశ్వరరావు గుండె నొప్పితో మరణించారు. మార్చి 21 మంగళవారం సాయంత్రం, చీరాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రాంనగర్ లోని వారి స్వగృహం నందు మల్లి నాగేశ్వరరావు పార్థివ దేహానిక, బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. తీవ్ర శోకసంద్రంలో ఉన్న సీఐ కుటుంబ సభ్యులను, బంధువులను పరామర్శించారు. పోలీస్ శాఖకు మల్లి నాగేశ్వరరావు చేసిన సేవలు ఎనలేనివని, ఆయన లేని లోటు తీర్చలేనిదని, ఆయన కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని, శాఖాపరంగా కుటుంబానికి, రావాల్సిన అన్ని రకాల పరిహారాలు, రాయితీలు సకాలంలో అందించడానికి కృషి చేస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. అనంతరం పోలీస్ శాఖ అధికార లాంఛనాలతో సీఐ మల్లి నాగేశ్వరరావు పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మల్లి నాగేశ్వర రావు ఆర్ఎస్ఐగా 1996 లో పోలీసు శాఖలోకి ప్రవేశించారు. 2007లో సివిల్ ఎస్ఐగా కన్వర్షన్ ద్వారా నియమితులయ్యారు.

నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు, నెల్లూరు త్రీ టౌన్, తడ పోలీస్ స్టేషన్ లలో ఎస్.ఐ గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొంది, నరసరావుపేట టూ టౌన్, పొన్నూరు టౌన్, గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహించారు. అనంతరం ఏ.సి.బి లో విధులు నిర్వహించి, అక్టోబర్ 2022 లో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు ఇన్స్పెక్టర్ గా బదిలీపై వెళ్ళారు. సీఐ సతీమణి వెంకటలక్ష్మి, కుమారుడు అంజనీకుమార్ లను ఓదార్చారు. మల్లి నాగేశ్వరరావు మృతిపట్ల జిల్లా పోలీస్ అధికారులు, సహోద్యోగులు విచారం వ్యక్తం చేసి, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి వారికి మనోనిబ్బరాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి వేడుకొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు, చీరాల డీఎస్పీ. పి.శ్రీకాంత్, డి.ఎస్.బి ఇన్స్పెక్టర్ ఏ. శ్రీనివాస్,చీరాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.సోమశేఖర్, చీరాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ.మల్లికార్జునరావు, బాపట్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జీ.వేణుగోపాలరెడ్డి, వేల్ఫేయిర్ ఆర్.ఐ బి.శ్రీకాంత్ నాయక్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed