Nellore: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో..!

by srinivas |
Nellore: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేం. ఒక నిరసన కార్యక్రమం అందర్నీ ఏకం చేయొచ్చు. ఒక్కో విమర్శ సొంత పార్టీ నేతలను సైతం దూరం చేయెుచ్చు. ఇది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయానికి సరిగ్గా సరిపోతుంది. స్వపక్షంలో విపక్షంలో మాదిరిగా మారిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆ పార్టీ పక్కన పెట్టేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేశారంటూ ఏకంగా పార్టీ నుంచే బయటకు పంపించేసింది. వైసీపీ నుంచి గెంటేసినప్పటి నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా రాజకీయం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పాత్ర పోషించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికార వైసీపీకి కంట్లో నలుసులా మారారు. వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

తాజాగా పొట్టేపాల్లెం కలుజు రిపేర్లు కోసం జలదీక్షకు పిలుపునిచ్చారు. ఈ జలదీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జలదీక్షకు ఒక్క వైసీపీ మినహా అన్ని పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. దారులన్నీ అటువైపే అన్నట్లు అన్ని పార్టీల నేతలు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసానికి క్యూ కట్టాయి. తమ మద్దతు ప్రకటించాయి.

కోటంరెడ్డి హౌస్ అరెస్ట్

నెల్లూరు రూరల్ పరిధిలో పొట్టేపాల్లెం కలుజు రిపేర్లు కోసం నిరసన తెలుపుతూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జలదీక్ష చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే దీక్షకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిను దీక్ష చేపట్టకుండా ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సమాచారం అందుకున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభిమానులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. మరోవైపు దీక్ష చేపట్టేందుకు చేస్తున్న ఏర్పాట్లను సైతం పోలీసులు అడ్డుకున్నారు. అక్కడికి ఎవరూ రాకుండా అడ్డుకున్నారు. బారికేడ్లు వేశారు.


మద్దతు కట్టడంలో సక్సెస్

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే వ్యూహాత్మకంగా అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడంలో విజయం సాధించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తలపెట్టిన జలదీక్షకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో అడుగులన్నీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసం వైపే వెళ్లాయి. వివిధ రాజకీయ ప్రతినిధులు తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. టీడీపీ, జనసేన, వామపక్షాలనేతలు తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. అటు కాంగ్రెస్ పార్టీ నేత, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నేత కనకట్ల రఘురాం ముదిరాజ్ సైతం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటికి చేరుకుని తమ సంఘీభావం ప్రకటించారు. మరోవైపు ఇండియన్ నేషనల్ లీగ్ (ఐఎన్ఎల్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ సమీ మద్దతు ప్రకటించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్టు ప్రజాస్వామ్య హక్కులకు విఘాతం కలిగించడమేనని వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా కేంద్రంలో అత్యంత కీలకంగా పని చేస్తున్న అన్ని రాజకీయ పక్షాల నేతల అడుగులు నెల్లూరులో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసం వైపు పడటం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడటం లేదు.


జలదీక్షకు అనుమతి లేదు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జలదీక్షకు అనుమతి కోరారని అయితే చిన్న రహదారి కావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని, అలాగే ఎమ్మెల్యే ఆరోగ్యం కూడా బాగోలేకపోవడంతో అనుమతి నిరాకరించినట్లు డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి వెల్లడించారు. జలదీక్షకు దిగే ప్రాంతంలో నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారని, పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ట్రాఫిక్ జామ్ వల్ల వాహనాలు నిలిచిపోతే విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడుతారన్నారు. చెరువు వద్దకు మద్దతుదారులు ఎక్కువగా వస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. అందులోనూ ఎమ్మెల్యే ఆరోగ్యం దృష్టా దీక్ష మంచిది కాదని, అందుకే అనుమతి ఇవ్వలేదని డీఎస్పీ వీరాంజనేయరెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story