వైసీపీకి తలపోటు.. మరో నిరసనకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యే

by srinivas |   ( Updated:2023-04-08 10:17:44.0  )
వైసీపీకి తలపోటు.. మరో నిరసనకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యే
X

దిశ, డైనమిక్ బ్యూరో: వదలా బొమ్మాళీ నిన్నొదలా...అన్నట్లు వైసీపీ ప్రభుత్వాన్ని వదిలేదే లేదు అంటున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ వైసీపీ అధిష్టానం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా చేయనంతగా టార్గెట్‌ చేస్తున్నారు. ఇప్పటికే జలదీక్ష పేరుతో వైసీపీ నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి పెట్టిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో పోరాటానికి శ్రీకారం చుడుతున్నారు. బారాషాహీద్ దర్గాకు రూ.15కోట్లు మంజూరు చేసి నేటికీ నిధులు విడుదల చేయకపోవడంపై నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మత పెద్దలు, మౌజాంలు మైనార్టీలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోస్ట్ కార్డులు, వాట్సప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా పోరాటం చేయాలని అందుకు అందరూ కలిసి రావాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు.


ఏకుమేకైన కోటంరెడ్డి

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు ఈ పేరు ఆంధ్రప్రదేశ్‌లో తెలియని వారు ఉండరు. ఒకప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికే పరిమితమైన ఆయనను ఇప్పుడు ఏకంగా రాష్ట్ర నాయకుడిని చేసేసింది వైసీపీ. వైసీపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఆరోపిస్తూ ఒక్కసారిగా వార్తల్లోకెక్కిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అప్పటి నుంచి నిత్యం వార్తల్లోనే నిలుస్తున్నారు. వైసీపీలోనే ఉంటూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో స్వపక్షంలో విపక్షంగా తయారయ్యారు. అసెంబ్లీలో ప్రతిపక్షంగా మారి ప్రభుత్వానికి ఏకుమేకై కూర్చున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వంపై తిరుగుబాటుకు దిగడంతో ఆ సెషన్ అంతా సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మాక్ అసెంబ్లీ నిర్వహించి మరోసారి వార్తల్లో నిలిచారు. అనంతరం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేశారంటూ వైసీపీ ఆరోపించింది. ఈ మేరకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితోపాటు నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే సస్పెండ్ చేసిందో అప్పటి నుంచి వైసీపీపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు.


మరో పోరాటానికి రంగం సిద్ధం

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో పోరాటానికి సిద్ధమయ్యారు. భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన బారాషాహిద్ దర్గా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయిస్తూ జీవో విడుదల చేసి ఇప్పటికి 9 నెలలైనా నిధులను మాత్రం మంజూరు చేయకపోవడంతో ఆయన పోరాట పంథాను ఎంచుకున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన సంతకానికే విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ నెల్లూరు జిల్లాలోని ప్రతి మసీదుకు వెళ్లి మత పెద్దలు మౌజాంలు, ఇతర మైనార్టీ నేతలతో ఆయన సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. బారాషాహీద్ దర్గాకు మంజూరైన నిధులు, వాస్తవ పరిస్థితి ఇంతవరకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వకపోవడం వల్ల విడుదల చేయలేదని, వారికి వివరించి వారి మద్దతును కూడగట్టే ప్రయత్నాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్నారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోని అన్ని మసీదుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి పోస్ట్ కార్డులు, ఎస్ఎంఎస్‌లు వాట్సాప్ రూపంలో నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా మైనార్టీలను పెద్ద ఎత్తున కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే నెల్లూరు జిల్లాలో బారాషాహిద్ దర్గాతో ప్రతి ఒక్కరికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన దర్గాకు నిధులు విడుదల చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాన్ని తెలియజేయడమే లక్ష్యంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అడుగులు పడుతున్నాయి. ఈ పోరాటంతో నైనా ముఖ్యమంత్రి సంతకానికి విలువనిస్తూ బారాషాహిద్ దర్గాకు నిధులు మంజూరవుతాయని మైనార్టీలు ఆశతో ఎదురుచూస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ కోటంరెడ్డి అడుగులు మాత్రం వైసీపీకి పెద్ద సవాల్‌గా మారుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

జలదీక్షతో సక్సెస్

నెల్లూరు రూరల్ పరిధిలో పొట్టేపాల్లెం కలుజు రిపేర్లు కోసం నిరసన తెలుపుతూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవలే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జలదీక్షకు పిలుపునిచ్చారు. దీక్ష చేపట్టేందుకు సిద్ధమవుతుండగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.అంతేకాదు దీక్ష చేపట్టేందుకు చేస్తున్న ఏర్పాట్లను సైతం పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. జలదీక్ష జరగకుండా పోలీసులు అడ్డుకుంటే అడ్డుకున్నారు కానీ వ్యూహాత్మకంగా అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడంలో మాత్రం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. టీడీపీ, జనసేన, కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లీగ్, వామపక్షాలనేతలు తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. అన్ని రాజకీయ పక్షాల నేతల అడుగులు నెల్లూరులో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసం వైపు పడటం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడలేదన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed