ఏపీ ప్రజలకు శుభవార్త... త్వరలో....

by S Gopi |   ( Updated:2023-02-26 03:22:41.0  )
ఏపీ ప్రజలకు శుభవార్త... త్వరలో....
X

దిశ, కడప: జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. టెండర్లు ఖరారు కావడంతో ఏప్రిల్ 5న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. రూ. 669.23 కోట్లతో తెలంగాణాకు చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్ ఈ పనులు దక్కించుకుంది.

కమిటీ నివేదిక మేరకు..

అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో బాదనగడ్డ సమీపంలో చెయ్యేరు నదిపై 2.24 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన అన్నమయ్య ప్రాజెక్టును 2001లో ప్రారంభించారు. రాజంపేట, పుల్లంపేట మండలాలకు జీవనాడి అయిన అన్నమయ్య ప్రాజెక్టు గత ఏడాది నవంబరు 19న వరదలు, భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. నదీ తీర గ్రామాలు జల దిగ్బంధమై 38 మంది మృత్యువాతపడ్డారు. దీంతో సీఎం జగన్ ఆదేశాల మేరకు పునర్నిర్మాణానికి నిపుణులు కమిటీని నియమించారు. కమిటీ చైర్మన్ గా ఇంజనీరింగ్ చీఫ్ సీ నారాయణరెడ్డి, హైడ్రాలజీ విభాగం చీఫ్ ఇంజినీర్ టీవీఎస్ఆర్ కుమార్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజినీర్ కే శ్రీనివాస్ తదితర అధికార బృందం గత ఏడాది మార్చి 29న డ్యామ్ పరిసరాలను పరిశీలించారు. కమిటీ నివేదిక మేరకు గత ఏడాది నవంబరులో ప్రాజెక్టు పునర్నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. ఈ మేరకు గతేడాది డిసెంబరు 24న టెండరు నోటీసు జారీ చేయగా అదే నెల 26 నుంచి టెండర్ల పక్రియ ప్రారంభమైంది.

రూ.660.24 కోట్లతో ఖరారు

రివర్స్ టెండరింగ్ లో 3.94 శాతం ఎక్సెస్ కు కోట్ చేసి తెలంగాణకు చెందిన రాఘవ కన్ స్ర్టక్షన్స్ కంపెనీ దక్కించుకుంది. కడప నీటి పారుదల శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ శ్రీనివాసులు ఫైనాన్షియల్ బిడ్ ను ఓపెన్ చేశారు. అందులో 4.99 శాతం ఎక్సెస్ కు టెండర్ కోట్ చేశారు. అనంతరం రివర్స్ టెండరింగ్ నిర్వహించగా 3.94 శాతానికి జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ కె హరినాథ్ రెడ్డి టెండరును ఖరారు చేశారు. టెండరు ఒప్పందం చేసుకున్న రోజు నుంచి రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది. పునర్నిర్మాణ అంచనా వ్యయం రూ.635 కోట్లు కాగా, టెండర్ ఎక్సెస్ రేట్లు మేరకు రూ.660.23 కోట్లు కానుంది.

కాంక్రీట్ నిర్మాణం

ప్రాజెక్టును పూర్తిగా కాంక్రీట్ తో నిర్మించనున్నారు. కొట్టుకుపోయిన స్థానంలోనే ఈ కట్ట 426.25 మీటర్ల పొడవు ఉంది. ప్రాజెక్టు కొట్టుకుపోకముందు 1.80 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జ్ సామర్థ్యంతో ఉన్న 5 గేట్లకు అదనంగా మరో 11 గేట్లను పునర్మిరించనున్నారు. ఇది 5.60 లక్షల క్యూసెక్కుల డిశ్చార్ సామర్థ్యం కలిగి ఉంటుంది.

మునుపటి సామర్థ్యమే

2.387 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్న ప్రాజెక్టు రాజంపేట, పుల్లంపేట మండలాల్లోని 13 వేల ఎకరాల ఆయకట్టుకు ఖరీఫ్ లోనూ, 6,500 ఎకరాల ఆయకట్టు రబీలో నీరు అందించనుంది. దీంతోపాటు 18 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయనుంది.

Advertisement

Next Story

Most Viewed