Tiruchanur Padmavati Temple : వైభ‌వంగా శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె

by Y. Venkata Narasimha Reddy |
Tiruchanur Padmavati Temple : వైభ‌వంగా శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి(Tiruchanur Sri Padmavati Ammavaru ) బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం తిరుమల శ్రీ‌వారి సారె(Tirumala Srivari Saare )ను తిరుమ‌ల నుండి తిరుప‌తిలోని అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్దకు తీసుకువ‌చ్చారు. శ్రీ‌వారి సారెకు ప్రత్యేక పూజ‌లు చేసిన అనంతరం అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవో శ్రీ వీరబ్రహ్మంకు అంద‌జేశారు. పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను ప్రతి ఏటా తీసుకురావ‌డం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారెను తిరుప‌తి పుర వీధుల‌లో కోమ‌ల‌మ్మ స‌త్రం, శ్రీ కోదండరామ స్వామి ఆలయం, శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఆల‌యం, ఆర్‌.టీ.సీ బ‌స్టాండ్‌, తిరుచానూరు పసుపు మండపం మీదుగా అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువ‌చ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప‌ద్మపుష్కరిణి వ‌ద్ద అమ్మవారికి సారె స‌మ‌ర్పించారు. అటు తర్వాత అమ్మవారికి పద్మ సరోవరం మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి పాండ్యన్ కిరీటం, లక్ష్మీ పతకం, డైమెండ్ నెక్లెస్, వజ్రాల గాజులు, వజ్రాలు పొదిగిన కమ్మలను దాదాపు మూడు కేజీలకు పైగా రూ. 1.11 కోట్లు విలువైన నగలను అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ శ్యామల రావు, సివిఏస్వో శ్రీధర్, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు శాంతా రామ్, భాను ప్రకాష్ రెడ్డి, నన్నపనేని సదాశివరావు, ఎస్. నరేష్ కుమార్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఇత‌ర అధికారులు, అర్చకులు, శ్రీ‌వారి సేవ‌కులు, విశేష సంఖ్యలో భ‌క్తులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed