మట్టి మాఫియాకు అడ్డేది.. దర్జాగా ప్రాజెక్ట్‌లో తవ్వకాలు?

by samatah |
మట్టి మాఫియాకు అడ్డేది.. దర్జాగా ప్రాజెక్ట్‌లో తవ్వకాలు?
X

మట్టి మాఫియా రెచ్చిపోతోంది. కొండలను సైతం మాయం చేసి చెరువులు, ప్రాజెక్టులపై కన్నేసింది. ఏకంగా ఎక్సకవేటర్లతో మట్టిని తోడేస్తూ జేబులు నింపుకుంటున్నారు. అనుమతులు లేకుండా వేస్తున్న అక్రమ వెంచర్లకు అధిక శాతం మట్టిని తరలిస్తున్నారని తెలుస్తోంది. పట్టపగలు టిప్పర్లు ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్న పట్టించుకునేవారు కరువయ్యారు. జంగారెడ్డిగూడెం మండలంలోని యథేచ్ఛగా జరుగుతున్న ఈ అక్రమ దందాపై దిశ అందిస్తున్న ప్రత్యేక కథనం.

దిశ, జంగారెడ్డిగూడెం :ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో ఉన్న కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయంలో వేసవికాలం సమీపిస్తే చాలు మట్టి తవ్వకాలు జోరందుకుంటున్నాయి. యర్ర కాలువ జలాశయంలో ఈ తతంగం యథేచ్ఛగా జరిగిపోతోంది. వేగవరం, తాడువాయి పరిధిలోని ప్రాజెక్ట్ భూముల రూపురేఖలను కూడా మార్చేశారు. ప్రాజెక్టు నిబంధనల ప్రకారం ఎగువ ప్రాంతాన్ని పూడిక తీయాల్సి ఉండగా ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా జరుగుతోంది. అధికారులు సుమారు 2000క్యూబిక్ మీటర్ల అంచనాతో అనుమతులు మంజూరు చేస్తే ఇక్కడ మాత్రం 20వేల క్యూబిక్ మీటర్ల మేర త్రవ్వకాలు చేపట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల నిర్దేశించిన లోతు కాకుండా అధిక లోతు త్రవ్వుతు అక్రమ రవాణాలో పాల్పడుతున్నారు సమీప ప్రజలు వాపోతున్నారు. ప్రాజెక్టులో ఉన్న గోతుల్లో పడి మత్స్యకారులు కొందరు మరణించిన సందర్భాలు చాలా ఉన్నాయి.

సిండికేట్ గా ఏర్పడి..

మట్టి అక్రమ తవ్వకాలకు మండలంలోని అధికార పార్టీ నేతల అండ దండలు పుష్కలంగా ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సిండికేట్ లాగా ఏర్పడి మట్టి రవాణా చేస్తున్నట్లు చెబుతున్నారు. మిగిలిన వారు ఎవరు మట్టిని తరలించినా, వారే పట్టిస్తారనే చర్చ నడుస్తోంది. మట్టి కావాలంటే సిండికేట్ వ్యక్తులను కలిస్తే పని జరిగిపోతుందని అంటున్నారు. అధికార పార్టీ నేతలు కావడంతో అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మట్టి కి ఇంత విలువ

జంగారెడ్డిగూడెం ఏజెన్సీకి ముఖ ద్వారం కావడం, ఇక్కడి భూముల రేట్లు రోజు రోజు కీ పెరుగుతుండటంతో వెంచర్లు పుట్టుకొస్తున్నాయి.ఏజెన్సీలో పని చేసి పలు శాఖల అధికారులు, వ్యాపార వేత్తలు వివిధ సముదాయాల వారు పట్టణం లో స్థిరపడటం తో స్థిరాస్తి కొనుగోళ్ల పై మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో పట్టణ సమీపంలో ఎక్కడ చూసినా వెంచర్లు దర్శనం ఇస్తున్నాయి. వెంచర్లు, లే అవుట్లకు మట్టి నిత్యావసరం కావడం తో మట్టి మాఫియాకి రెక్కలు వచ్చాయి. ఒక టిప్పరు మట్టి రూ.5వేల నుండి 6వేలకు అమ్మకాలు సాగిస్తూ ఒక్క రాత్రిలో లక్షలు గటిస్తున్నారు.

నామమాత్రపు చర్యలేనా

భారీగా మట్టితవ్వకాలు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కుల వద్ద ముడుపులు తీసుకొని సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతం లో ప్రాజెక్ట్ లో తవ్వకాలు జరుపుతున్నారని స్థానిక ప్రజా ప్రతినిధి అడ్డుకోగా, తప్పని పరిస్థితుల్లో లారీలను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కులు విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్నారు. టిప్పర్లను పట్టుకున్నా నామమాత్రపు జరిమానాలు వేసి వదిలేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొంతకాలానికి కొండలు ప్రాజెక్ట్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Next Story

Most Viewed