మౌనమేలనోయి: తెలంగాణలో ఎన్నికల ప్రచారంపై పవన్ కల్యాణ్ దూరం

by Seetharam |
మౌనమేలనోయి: తెలంగాణలో ఎన్నికల ప్రచారంపై పవన్ కల్యాణ్ దూరం
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. మరో 15 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకు సంబంధించి ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ సైతం పూర్తైంది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారంలో మునిగితేలుతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితలు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఇక జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి రాష్ట్ర నాయకత్వంతోపాటు జాతీయ నాయకులు సైతం తెలంగాణలో తిష్టవేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన సైతం పోటీ చేస్తోంది. బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 8 నియోజకవర్గాలలో అభ్యర్థులను బరిలోకి దించింది. అభ్యర్థులను అయితే బరిలోకి దించిన జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో మాత్రం మీన మేషాలు లెక్కిస్తున్నారు. ఈ మౌనం వెనుక కారణం ఏంటి..? తెలంగాణలో ప్రచారం చేయడానికి భయపడుతున్నారా? అనే చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతుంది.

ప్రచారంపై మీనమేషాలు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఆయా రాజకీయ పార్టీలో పోటీపడుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో కారు వేగంతో దూసుకుపోతుంది. ఇకపోతే హస్తం పార్టీ సైతం ప్రచారంలో హవా చూపిస్తోంది. ఇకపోతే కమల దళం సైతం ప్రచారంలో వికసిస్తోంది. జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల ప్రచారంలోకి జాతీయ నాయకులను సైతం రంగంలోకి దింపింది. దీంతో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈనెల 30న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. అటు జనసేన పార్టీ అభ్యర్థులు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా వారిలో అంత ఉత్సాహం కనిపించడం లేదు. ఇందుకు కారణం లేకపోలేదు. అన్ని రాజకీయ పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదు.ఎన్నికల ప్రచారంపై కిమ్మనడం లేదు. అభ్యర్థులను అయితే ప్రకటించారు కానీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అంశంపై మాత్రం అంతగా ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించడం లేదన్నట్లు తెలుస్తోంది.

అలా మెరిసి ఇలా వెళ్లిపోయారు

ఇకపోతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో మాత్రమే పవన్ కల్యాన్ మెరిపించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో తప్పదన్నట్లు బహిరంగ సభలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆ సభకు ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఆ వేదిక పంచుకున్నట్లు తెలుస్తోంది.ఆ బహిరంగ సభలోనూ పవన్ కల్యాణ్ మాటల తూటాలు పేల్చలేదు. కేవలం మోడీ తనకు పెద్ద అన్న అని..బీసీలను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని మాత్రమే పిలుపునిచ్చారు. అనంతరం ఎక్కడా బహిరంగ సభలో పవన్ కల్యాణ్ కనిపించలేదు. పోనీ బీజేపీతో కలిసి ఉమ్మడి వేదికను సైతం పంచుకోవడం లేదు. దీంతో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి రాకపోవడంపై పార్టీ శ్రేణుల్లో నిరాస నెలకొంది. పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలోకి వస్తే తమకు బూస్ట్ వచ్చినట్లు అవుతుందని ఫలితంగా ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచుతామని అభ్యర్థులు చెప్తున్నారు. మరోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ సైతం పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తోంది. అటు ఓయూ జేఏసీ సైతం పవన్ కల్యాణ్ గో బ్యాక్ అంటూ నిరసనలు తెలియజేస్తోంది. ఇంత జరుగుతున్నా పవన్ కల్యాణ్ మౌనంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇంకా 15 రోజులు మిగిలి ఉండటంతో ఈ లోగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారేమో అని కొందరు అంటున్నారు. మెుత్తానికి పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed