Sharmila: బొత్స వ్యాఖ్యలపై షర్మిల ఫైర్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-02-20 10:01:23.0  )
Sharmila: బొత్స వ్యాఖ్యలపై షర్మిల ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : తనపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల(AP Congress chief YS Sharmila)మండిపడ్డారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(Jagan)కు జైలుకు వెళ్లి ఖైదీలను పరామర్శించడానికి టైం ఉందిగానీ.. అసెంబ్లీకి వెళ్ళడానికి ధైర్యం లేదు అని నిన్న షర్మిల చేసిన వ్యాఖ్యలపై బొత్స స్పందిస్తూ ఆమెకు పని లేదు.. ఖాళీగా కూర్చొని ట్వీట్‌లు పెట్టేదానికి మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ తేలిగ్గా తీసిపారేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు షర్మిలకు కనిపించవని..ఎంతసేపు జగన్ ను వ్యక్తిగతంగా విమర్శించమే పనిగా పెట్టుకుందని బొత్స విమర్శించారు.

బొత్స వ్యా్ఖ్యలపై షర్మిల స్పందిస్తూ బొత్స సత్యనారాయణ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎక్స్ వేదికగా విమర్శించారు. నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నదెవరో.. పని చేయకుండా రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా దోచుకుతిన్నది ఎవరో... రాష్ట్ర ప్రజానీకానికి తెలుసంటూ జగన పాలన(Jagan's Governament)పై మరోసారి షర్మిల నిప్పులు కక్కారు.

5 ఏళ్లు కుంభకర్ణుడి లెక్క నిద్ర పోయారని.. అధికారం అనుభవిస్తూ ఖాళీగా కూర్చున్నారని..పార్టీ పాలసీకి, తండ్రి ఆశయాలకు విరుద్ధంగా బీజేపీకి దత్తపుత్రుడిగా మారారని..ప్రజల సంపదను ప్యాలెస్ కి మళ్లించుకున్నారంటూ జగన్ పాలనను విమర్శించారు. 5 ఏళ్లు ఖాళీగా ఉండి ఎన్నికల ముందు సిద్ధం అంటూ బయటకు వచ్చారని..పని చేయకుండా ఖాళీగా ఉన్నారని తెలిసి ప్రజలు మిమ్మల్ని పనికి రాకుండా చేశారని..51 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారని..చివరికి ప్రతిపక్ష హోదా లేకుండా బుద్ధి చెప్పారని షర్మిల గుర్తు చేశారు.

మిర్చి రైతుల కష్టాలపై మీకంటే ముందుగానే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కాంగ్రెస్(Congress) పార్టీయేనని.. రేట్ల హెచ్చుతగ్గులపై రైతు నష్టపోకుండా రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ అని షర్మిల పేర్కొన్నారు. కేంద్రం నుంచి వెంటనే నిధులు తేవాలని అడిగింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని..సూపర్ సిక్స్ లో భాగంగా పెట్టుబడి సహాయం రూ.20 వేలు వెంటనే అందించాలని కోరింది కూడా మా కాంగ్రెస్ పార్టీయేనని, ప్రతి నెల కూటమి హామీలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని షర్మిల చెప్పుకొచ్చారు.

అసెంబ్లీలో అడిగే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి.. 11 సీట్లతో అసెంబ్లీకి వెళ్ళే అవకాశం మీకుంది కాబట్టి.. వైసీపీని శాసన సభకు వెళ్ళాలని డిమాండ్ చేశామని... రైతుల పట్ల కూటమి నిర్లక్ష్యాన్ని సభ వేదికగా ఎండగట్టాలని అడిగామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు(Chandrababu) సూపర్ సిక్స్(Super Six) అమలు చేయాలని డిమాండ్ చేస్తూనే, వైసీపీ అసెంబ్లీకి వెళ్ళాలని కోరితే.. ప్రజల పక్షాన నిలబడాలని అడిగితే.. వ్యక్తిగత అజెండా అంటూ వైసీపీ నేతలు భుజాలు తడుముకోవడం హాస్యాస్పదమని షర్మిల విమర్శించారు.

సమాధానం చెప్పలేక దాటవేయడం మీ అవివేకానికి నిదర్శనమని..మళ్ళీ మళ్ళీ వైసీపీనీ అడుగుతున్నామని.. అసెంబ్లీకి వెళ్ళే అంశంపై మీ పాలసీ ఏంటో చెప్పండని షర్మిల డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్ళకపోతే వెంటనే రాజీనామాలు ప్రకటించండని..ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ లు పెట్టడానికి కాదు ప్రజలు మీకు ఓట్లు వేసిందని..దమ్ముంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పండని షర్మిల బొత్స, జగన్ లను డిమాండ్ చేశారు.

Next Story