Megastar Chiranjeevi వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు సీరియస్!

by GSrikanth |   ( Updated:2023-08-09 04:10:29.0  )
Megastar Chiranjeevi వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు సీరియస్!
X

మెగాస్టార్​ చిరంజీవి వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. మెగా కుటుంబం వల్ల రాజకీయంగా.. సినిమాలపరంగా ప్రజలకు ఒరింగిందేంటని వైసీపీ కార్యకర్తలు నిలదీస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి వాళ్లకు లేదని ట్రోల్​ చేస్తున్నారు. ఇటీవల రాజ్యసభలో సినిమాటొగ్రఫీ అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా గళమెత్తారు. వందల కోట్ల బడ్జెట్​ తో తీసే సినిమాల్లో కార్మికులకు దక్కుతున్న వాటా చాలా దారుణమన్నారు. హీరోలకు అంత రెమ్యునరేషన్​ ఇవ్వాల్సిన అవసరమేంటని నిలదీశారు. వరుస పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల విజయోత్సవ సభలో చిరంజీవి స్పందించారు. హీరోల రెమ్యునరేషన్​ గురించి ప్రభుత్వానికి ఎందుకు ? ప్రజలు మెచ్చేట్లు పాలన చేయాలని చురకలంటించారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ అధికారంలోకి వచ్చాక సినిమా టిక్కెట్లపై కొన్నాళ్లు వివాదం చెలరేగింది. ఇష్టారీతిన పెంచుకోవడానికి వీల్లేదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. చివరకు సినీ పరిశ్రమ పెద్దలు రంగంలోకి దిగారు. సీఎం జగన్​తో చర్చించారు. అనంతరం గొడవ సద్దుమణిగింది. వారాహి యాత్రలో పవన్​ కల్యాణ్​ తాను ఒక్కో సినిమాకు రూ.200 కోట్లు తీసుకుంటానని చెప్పారు. ఆయన సీఎం జగన్​ను టార్గెట్​ చేసి మాట్లాడుతున్నా సినీ పరిశ్రమ నుంచి వైసీపీకి ఎలాంటి మద్దతూ లభించలేదు.

పారితోషికం చర్చ అందుకేనా..?

సినీ రంగం మొట్టమొదటి నుంచి టీడీపీకి వెన్నుదన్నుగా ఉంది. ఆ పార్టీకి సినీ ప్రముఖులు ఆర్థిక అండదండలు ఇస్తున్నారని వైసీపీ భావిస్తోంది. సినీ రంగాన్ని తమ వైపు మల్చుకోవడానికి వైసీపీ చేసిన ప్రయత్నాలు ఏవీ అంతగా ఫలించలేదు. అందువల్లే వ్యూహాత్మకంగా హీరోలు, దర్శకులకు అంత రెమ్యునరేషన్​ ఎందుకంటూ చర్చ లేవదీసినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

టాలీవుడ్ లో విపరీత పోకడలు..

దక్షిణాది సినిమా పరిశ్రమలో ఎక్కడా లేని పోకడలు టాలీవుడ్​లోనే కొనసాగుతున్నట్లు సినీ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం కొన్ని కుటుంబాల చేతుల్లోనే తెలుగు సినీ చిత్ర సీమ బందీ అయిందంటున్నారు. కేవలం నాలుగైదు కోట్ల బడ్జెట్​తో తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలు ఆస్కార్​ స్థాయిలో ఆదరణ పొందుతున్నాయి. వాళ్ల చిత్రాల్లో సమాజాన్ని పట్టిపీడిస్తున్న అనేక రుగ్మతలపై ఆలోచనలు రేకెత్తిస్తుంటాయి. ఆయా పాత్రల్లో నటనకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నాయి. అనేక భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రాలు ప్రజల నుంచి జేజేలు అందుకుంటున్నాయి. దీనికి భిన్నంగా టాలీవుడ్​లో కొద్ది కుటుంబాలకు చెందిన హీరోలను ఎలివేట్​ చేయడం కోసమే చిత్రాలు తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వారి కబంధహస్తాల్లోనే..

వందల కోట్ల వ్యయంతో నిర్మించే తెలుగు చిత్రాల బడ్జెట్లో హీరో, హీరోయిన్​, దర్శకులకే సింహభాగం పోతోంది. మిగతా నటులు, నిర్మాణ కార్మికులకు అందే పారితోషికాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. కొద్ది రోజులు షూటింగ్​లు లేకుంటే సినీ పరిశ్రమ కార్మికులు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని కుటుంబాలకు చెందిన వాళ్ల కబంధ హస్తాల్లోనే సినీ థియేటర్లున్నాయి. వాళ్లను కాదని ఎవరైనా సినిమా తీసినా థియేటర్లు ఇవ్వకుండా వేధిస్తారు. కొందరు చిన్న సినిమాల నిర్మాతలు ఈ బాధలు భరించలేకనే తమ చిత్రాలను ఓటీటీ ప్లాట్​ఫాంపై విడుదల చేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి సమయంలో మెగాస్టార్​ వ్యాఖ్యలు ప్రభుత్వానికి పుండు మీద కారం చల్లినట్లుంది. ఈ వివాదం ఎక్కడిదాకా దారితీస్తుందోనని సర్వత్రా చర్చజరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed