సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట: ఈనెల 30వరకు అరెస్ట్ చేయెుద్దని ఉత్తర్వులు

by Seetharam |   ( Updated:2023-11-09 07:05:43.0  )
సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట: ఈనెల 30వరకు అరెస్ట్ చేయెుద్దని ఉత్తర్వులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : సుప్రీంకోర్టులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు స్వల్పఊరట లభించింది. ఈనెల 30 వరకు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయెుద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. గురువారం ఫైబర్ నెట్ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం విచారణను మరోసారి వాయిదా వేసింది. ఈనెల 30కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. అంతేకాదు అప్పటి వరకు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయవద్దని సూచించింది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ కేసును జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేదిల బెంచ్ విచారిస్తోంది. అయితే తాజాగా గురువారం సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు నాయుడు అనారోగ్య కారణాలతో ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై ఉన్నారని సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలియజేశారు. ఇప్పటికే చంద్రబాబుకు శస్త్రచికిత్స జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ ముగిసే వరకు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయబోమన్న ఉత్తర్వులు కొనసాగించాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బెంచ్‌ను కోరారు. దీంతో స్కిల్ స్కాం కేసులో తీర్పు వెల్లడయ్యే వరకు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.

వాదనలు ఇవే..

స్కిల్ కేసులో తీర్పు వచ్చిన తర్వాతే విచారణ చేపడతాం అని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. దీపావళి తర్వాత స్కిల్ కేసు తీర్పు ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఏపీ ఫైబర్ నెట్ కేసులోనూ 17 ఏ నిబంధన ఉందని ఈ నేపథ్యంలో స్కిల్ కేసులో తీర్పు వచ్చిన తర్వాతే విచారణ చేపడతామని తెలిపింది. ఈ నేపథ్యంలో కేసు విచారణ ముగిసే వరకు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయబోమన్న నిబంధనలను కొనసాగించాలని చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన హామీలకే కట్టుబడి ఉంటామని ప్రభుత్వం తరఫు న్యాయవాది వెల్లడించారు. దీంతో ఇరువురు వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేదిల బెంచ్ తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. అయితే సిద్ధార్థ లూథ్రా విజ్ఞప్తి మేరకు విచారణను ఈనెల 30కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed