దారుణం.. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి పసికందు బలి

by Y.Nagarani |
దారుణం.. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి పసికందు బలి
X

దిశ ప్రతినిధి, విజయనగరం: చీపురుపల్లిలోని బాబుజీ ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకంతో ఓ పసికందు ప్రాణం బలైంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. సొంత ఖర్చులతో మెరుగైన వైద్య సేవలను ప్రైవేటు ఆసుపత్రిలోనే పొందుదామనే నమ్మకంతో గరివిడి మండలం కాపుశంబంకు చెందిన ఎనోతుల మౌనికను , భర్త ఎనొతుల గౌరినాయుడుతో పాటు ఆమె తల్లిదండ్రులు చీపురుపల్లిలోని బాబుజి ప్రైవేట్ ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం 6 గంటలకు చేర్పించారు.

డాక్టర్.. డబుల్ డ్యూటీ..

మౌనిక ఆసుపత్రిలో చేరే సమయానికి నిపుణులైన వైద్యులుగానీ, గైనకాలజిస్ట్ గానీ ఆసుపత్రిలో లేరు. అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న గైనకాలజిస్ట్ డాక్టర్ శైలజ.. రాజాం ప్రభుత్వ ఆసుపత్రి (సి హెచ్ సి)లో గైనకాలజిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె రాజాం నుంచి ప్రభుత్వ విధులు ముగించుకుని తిరిగి ప్రైవేటు ఆసుపత్రికి వచ్చేసరికి సాయంత్రం అవుతుందని, ఎప్పటిలాగే ఆమె వచ్చేంతవరకూ పేషెంట్ కు కల్లబొల్లి మాటలు చెప్పేసి కాలక్షేపం చేసుకుంటూ వచ్చేద్దామని సిబ్బంది నిర్ణయించుకున్నారు.

డెలివరీ వీడియోలు చూస్తూ..

మధ్యాహ్నం 12 గంటలు దాటిన తరువాత మౌనికకు పురిటినొప్పులు ఎక్కువవ్వడంతో చేసేది లేక ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ వ్యక్తి తానే డాక్టరునని చెప్పుకుంటూ మౌనికకు సోషల్ మీడియా వేదికగా ప్రసవయత్నం చేశాడు. ఓ మొబైల్‌లో యూట్యూబ్‌లో డెలివరి వీడియోలు ఆన్ చేసి పక్కన పెట్టుకున్నాడు. మరో మొబైల్‌లో డాక్టర్ శైలజతో వీడియో కాల్‌లో ఉంటూ ప్రసవం చేయడానికి ప్రయత్నించాడు. ఎటువంటి నైపుణ్యం లేని ఓ వ్యక్తి డాక్టర్ అవతారమెత్తి నేరుగా డెలివరీ చేసి శిశివు ప్రాణాన్ని బలిగొన్నాడు. విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు బాబుజి ఆసుపత్రికి చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి బిడ్డ చావుకు కారణమైన వ్యక్తితో పాటు సంబంధిత ప్రైవేటు ఆసుపత్రిపై ఉన్నతాధికారులు చట్ట పరమైన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

Advertisement

Next Story