సొంత పత్రిక పాలేగాళ్లకు లక్షల్లో జీతాలు.. Prathipati Pulla Rao

by Seetharam |   ( Updated:2022-10-29 13:08:44.0  )
సొంత పత్రిక పాలేగాళ్లకు లక్షల్లో జీతాలు.. Prathipati Pulla Rao
X

దిశ, ఏపీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంతపత్రికపై మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ జమానాలో ఆయన సొంత పత్రిక పాలేగాళ్లకు లక్షల్లో ప్రజా ధనం జీతాలుగా దోచిపెడుతున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. 'జగన్ పాలనలో ఆర్థిక పరిస్థితి కంచే చేను మేసినట్లుగా తయారైంది. ప్రభుత్వం డబ్బులు ఇవ్వటంలేదని ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేసేవారు రోగులను వెనక్కి పంపుతున్నారు. ఒక ఆర్థిక నేరస్థుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఎలావుంటుందో రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు.

జగన్ హయాంలో రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరింది. అవినీతి నుంచి పుట్టిన పత్రిక, ఛానల్.. ఈ రెండింటికి రూ.1200 కోట్లు వివిధ మార్గాల్లో ఏ విధంగా క్విడ్ ప్రోకోగా వచ్చాయో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఆధీనంలో జగన్ పత్రిక కేంద్ర కార్యాలయం, బ్రాంచ్ కార్యాలయాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాలు నిష్పక్షపాతంగా ఎక్కడా పనిచేయడం లేదు అని చెప్పుకొచ్చారు. రాజకీయ లబ్ది కోసం ఆడుతున్న డ్రామాయే తప్ప మూడు రాజధానులు నిర్మించలేరు అని చెప్పుకొచ్చారు. రాయలసీమలో వైసీపీకి ఎక్కడా గౌరవంలేదు.

అమరావతిని రాజధానిగా ప్రజలు ఎప్పుడో ఆమోదించారు. అమరావతే రాజధాని, ఇక్కడే ఇల్లు కడుతున్నానని జగన్ చెప్పి ఆతరువాత మాట మార్చారు. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు ఇంటికి పంపించాలా అని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు అంటూ మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఒకే సామాజిక వర్గానికి 854 పోస్టులను కట్టబెడతారా?

ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం కమ్మ సామాజిక వర్గానికి చెందిన 35 మంది డీఎస్పీలను నియమించిందని వైసీపీ నాయకులు ఒక గ్లోబల్ ప్రచారం చేశారు అని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుర్తు చేశారు. నేడు వైసీపీ ప్రభుత్వం ఎనిమిది వందల యాభై నాలుగు పోస్టులను ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టింది. దీన్నేమంటారు అని నిలదీశారు. సొంత పత్రిక, చానెల్స్‌లలో పనిచేసే వారిని కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ సిబ్బందిగా తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకోలో సిద్ధహస్తుడు అని విమర్శించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న జగన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలి అని హెచ్చరించారు.

చంద్రబాబు పరిపాలన చూశాం, ఒకసారి జగన్ పరిపాలన కూడా చూద్దామనే ఉద్దేశంతో ప్రజలు వైసీపీకి ఓట్లు వేశారు. నేడు అదే తాడికొండ, మంగళగిరిలో రాజీనామా చేసి వచ్చి పోటీ చేస్తే మాట తప్పిన జగన్‌కు ప్రజలు ఏ విధంగా తీర్పు ఇస్తారో తెలుస్తుంది అని హెచ్చరించారు. ఒకే రాజధాని అని తెలుగుదేశం ఒకే మాట మీద ఉంది అని చెప్పుకొచ్చారు. రాయలసీమ ఆత్మగౌరవ సభ పెట్టినా, ఉత్తరాంధ్ర యాత్ర పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అమరావతే ఏకైక రాజధాని అనే స్టాండ్ తో టీడీపీ ఉంది. ఎప్పుడు ఎన్నికలొచ్చినా దాంతోనే ముందుకు వెళ్తాం అని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు క్లారిటీ ఇచ్చారు.

ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎందుకు ప్రధాని జోక్యం చేసుకోవడంలేదని ఆలోచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే అమరావతి నిర్మాణం ముందుకెళ్లే అవకాశం ఉందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.

Next Story