ఘోర ప్రమాదానికి గురైన కుటుంబం.. అధ్వానంగా అంబులెన్స్‌ వాహనాల నిర్వహణ

by Indraja |   ( Updated:2024-03-12 05:00:59.0  )
ఘోర ప్రమాదానికి గురైన కుటుంబం.. అధ్వానంగా అంబులెన్స్‌ వాహనాల నిర్వహణ
X

దిశ వెబ్ డెస్క్: ఎవరికైనా ప్రమాదం జరిగిన వెంటనే సాయం కోసం గుర్తుకు వచ్చే పేరు అంబులెన్స్‌. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అంబులెన్స్‌ వాహనాల నిర్వహణ ఆంధ్రప్రదేశ్ లో అధ్వానంగా మారింది. ప్రమాదం జరిగిందని ఫోన్ చేసిన కొన్ని గంటలకు కూడా అంబులెన్స్ రాని దుస్థితి నేడు రాష్ట్రంలో నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా సమయానికి ఆంధ్రప్రదేశ్ లో అంబులెన్స్ రాకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన ఘటనలు కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే నిన్న( సోమవారం) విశాఖపట్నంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖ జిల్లా లోని పాత గాజువాక సమీప డ్రైవర్ల కాలనీకి చెందిన ఎం.గణేష్‌, భవానీ(38) దంపతులు నిన్న సాయంత్రం తమ ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటీపై అనకాపల్లి జిల్లాలోని గోవాడ నుంచి ఇంటికి బయలుదేరారు.

ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల సమయంలో విశాఖ శివారు మూడు మదాలు కూడలి వద్దకు చేరుకోగానే స్కూటీ అదుపు తప్పింది. దీనితో దంపతులతో సహా ఇద్దరు పిల్లలు కింద పడిపోయారు. కాగా ఈ ఘటనలో భవానీ తలకు తీవ్ర గాయాలు కాగా, మిగిలిన ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం పై స్పందించిన స్థానికులు వెంటనే 108 కు ఫోన్ చేశారు. అయితే ఫోన్ చేసిన 40 నిమిషాలకు కూడా అంబులెన్స్ రాలేదు.

కాగా తలకు తీవ్ర గాయమైన బాధితురాలు భవాని నొప్పితో విలవిల్లాడారు. ఎంత సేపు చూసిన అంబులెన్స్ రాకపోవడంతో ఇక చేసేదేమీ లేక ఇటుక లోడుతో గాజువాక వైపు వెళ్తున్న లారీని ఆపి అందులో క్షతగాత్రురాలిని ఎక్కించి అగనంపూడి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

ఇక ఆసుపత్రి సిబ్బంది ప్రధమ చికిత్సను అందించారు. అనంతరం రాత్రి ఏడున్నర గంటలకు 108 వాహనం ఆసుపత్రికి చేరుకుంది. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని ఆ అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు.

Advertisement

Next Story