‘పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా’ నంబర్ ప్లేట్ తొలగించి..స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు!

by Jakkula Mamatha |   ( Updated:2024-07-10 08:38:10.0  )
‘పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా’ నంబర్ ప్లేట్ తొలగించి..స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు కీలక శాఖల బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు వినూత్న రీతిలో తమ అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ..బైక్ నెంబర్ ప్లేట్ పై ‘పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా’ అని వేసుకోవద్దని సూచించారు.

నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన జనసైనికులు చట్టాన్ని పాటించాలని కోరారు. నెంబర్ ప్లేట్ పై పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాసుకుంటే పోలీసులు తనను తిడతారని, అందుకే మోటారు వాహన చట్టం నిబంధనల మేరకు నెంబర్ కనిపించేలా నంబర్ ప్లేట్ ఉండాలని చెప్పిన సంగతి తెలిసిందే. అయిన కొంతమంది నెంబర్ ప్లేట్స్ మార్చుకోలేదు. తాజాగా బుధవారం విజయవాడలో పోలీసుల తనిఖీల్లో ‘పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా’ ప్లేటుతో ఉన్న బైక్‌ను గుర్తించి వాహనదారుడికి వార్నింగ్ ఇచ్చారు. ఇలా నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడపడం నేరమని, ఒకవేళ బైక్ పోయినా గుర్తించలేమని అవగాహన కల్పించారు. మీ అభిమానాన్ని బైక్‌పై వేరే చోట ముద్రించాలని, నంబర్ ప్లేట్ తప్పనిసరి అని సూచించారు. వెంటనే పాత బోర్డును తొలగించి ఆర్‌టీఏ ఇచ్చిన బోర్డును పెట్టించారు.

Advertisement

Next Story