6 ఎంపీ సీట్లు గెలవాల్సిందే.. ఏపీలో బీజేపీ టార్గెట్

by Mahesh |   ( Updated:2024-03-11 03:15:32.0  )
6 ఎంపీ సీట్లు గెలవాల్సిందే.. ఏపీలో బీజేపీ టార్గెట్
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: అరకు నుంచి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత పోటీకి దిగుతారని తెలిసింది. 2014లో ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి అరకు ఎంపీగా విజయం సాధించారు. అక అనకాపల్లి నుంచి మొన్నటి వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేశ్ పోటీ చేయనున్నారని సమాచారం. పొత్తు కలపడంలో కీలక పాత్ర పోషించిన ఆయన కోసమే జనసేన అనకాపల్లి సీటును తద్వారా మూడో ఎంపీ సీటును బీజేపీకి త్యాగం చేసింది. రాజమండ్రి నుంచి పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేయనున్నారు. గతంలో ఆమె విశాఖ నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేశారు.

ఏలూరు నుంచి బీజేపీ.. నర్సాపురం నుంచి రఘురామ?

ఏలూరు సీటు నుంచి బీజేపీ బరిలోకి దిగితే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అభ్యర్థి కావచ్చని అంటున్నారు. ఏలూరు నుంచి బీజేపీ అభ్యర్థి బరిలో వుంటే నర్సాపురం నుంచి ప్రస్తుత ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీకి దిగుతారు. ఏలూరు నుంచి బీజేపీ పోటీ చేయకపోతే రఘురామ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశాలున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసినట్లైతే రాజంపేట సీటును బీజేపీ తీసుకొంటుంది. లేనిపక్షంలో హిందూపురం నుంచి సత్యకుమార్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి. తిరుపతి సీటును బీజేపీ కోరుతోంది. గతంలో పోటీ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ, దాసరి శ్రీనివాసులు తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

టీడీపీ, జనసేనలతో సమన్వయం ముఖ్యం

లోక్‌సభ బరిలోకి దిగనున్న బీజేపీ నేతలు తెలుగుదేశం, జనసేనలతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పలు నియోజకవర్గాల్లో ఆ ప్రాంతంలో సంబంధం లేని వారు పోటీ చేయ నున్నందున సమన్వయం తప్పనిసరి అని పార్టీ భావిస్తోంది. ఇతర పార్టీలతో సత్సంబంధాలు కొనసాగించగలిగిన వారిని బరిలోకి దించాలని, ఆర్థికంగా పటిష్టమైన వారు అయితే ఇంకా మంచిదని పార్టీ యోచిస్తోంది. సీఎం రమేశ్, పురందేశ్వరి, రఘురామకృష్ణంరాజు, సుజనాచౌదరి, సత్యకుమార్ వంటి నేతలైతే సమన్వయానికి ఇబ్బందులు వుండవని అనుకొంటున్నారు.

విభజన హామీల సమస్యలను అధిగమించడమెలా?

రాష్ట్రంలో బీజేపీకి పెండింగ్‌లో ఉన్న విభజన హామీలు పెద్ద గుదిబండగా మారనున్నాయనే చర్చ జరుగుతోంది. ఆ సమస్యను అసెంబ్లీ కంటే లోక్‌సభ సభ్యులే అధిగమించాల్సిన అవసరం వుంది. రైల్వే జోన్ జాప్యం అంశాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్రం నెట్టేసింది. తమ ప్రభుత్వం రాష్ట్రంలో రాగానే పోలవరం పూర్తి చేస్తామనే హామీ ఇస్తారు. అయితే, ఇక ప్రధాన సమస్యలైన ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏం చేయాలి? ఏం చెప్పాలి? అనే సందిగ్ధం ఇప్పటికీ బీజేపీని వెంటాడుతోంది.

తెలుగుదేశం అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపుతామని, అవసరమైతే రాష్ర్ట ప్రభుత్వం ఆ నష్టాన్ని భరించి ప్రభుత్వరంగంలోనే ప్లాంట్‌ను నడుపుతుందని తెలుగుదేశం యువనేత నారా లోకేశ్ ఇప్పటికే హామీ ఇచ్చారు. బీజేపీ ఆ హామీ విషయంలో ఏం చేస్తుంది? ప్రత్యేక హోదా లేదా వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఏం చేస్తుంది అన్నదే ప్రశ్నార్థకం.

Advertisement

Next Story