జనసేన గల్ఫ్ దేశాల కన్వీనర్లను ప్రకటించిన పవన్ కల్యాణ్

by Seetharam |   ( Updated:2023-09-28 13:05:28.0  )
Pawan Kalyan Demands Telangana Government To Solve Basara IIIT Students Problems
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన పార్టీ గల్ఫ్ దేశాల కన్వీనర్లను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీకి విదేశాల్లోని ప్రవాస భారతీయులు చేస్తున్న సేవలు ఎంతో విలువైనవిగా పవన్ కల్యాణ్ అభివర్ణించారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో స్థిరపడిన తెలుగువారు జనసేన పార్టీ బలోపేతానికి తమవంతు కృషిని మద్దతును నిరంతరంగా కొనసాగించడం ఆనందదాయకం అని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయా దేశాలల్లోని జనసైనికులు పార్టీ అభివృద్ధికి మరింతగా దోహదపడేలా కన్వీనర్లను ఈ సందర్భంగా నియమిస్తున్నట్లు వెల్లడించారు. అనాదిగా పార్టీకి సేవలు అందిస్తూ నాయకత్వ లక్షణాలతో ముందుకు వెళ్లిన వారిని గుర్తించి ఈ కమిటీలలో చోటు కల్పించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. పార్టీ బలోపేతానికి ఈ కన్వీనర్లు చేసే కృషికి ప్రతీ ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన జనసేన పార్టీ గల్ఫ్ దేశాల కన్వీనర్లకు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్లుగా కేసరి త్రిమూర్తులు(యూఏఈ),చందక రాందాసు(ఒమన్), కాంచన శ్రీకాంత్ బాబు(కువైట్), మెుగళ్ల చంద్రశేఖర్(యూఏఈ), బాణావత్ రామచంద్ర నాయక్(కువైట్)లను నియమించారు. అలాగే కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రయిన్, యూఏఈ, గల్ఫ్ జనసేన వీరమహిళల విభాగాలను నియమించారు.

యూఏఈ ప్రాంతీయకన్వీనర్‌గా జాన్ బాబు

ఇదిలా ఉంటే యూఏఈ ప్రాంతీయ కన్వీనర్‌గా పెనుమాల జాన్ బాబు నియమితులయ్యారు. జాన్ బాబు యూఏఈలో జనసేన పార్టీ బలోపేతానికి ఆది నుంచి కృషి చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జాన్ బాబు జనసేన పార్టీ పరంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. యూఏఈలోని తన మిత్రబృందంతో కలిసి ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడం, అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. దివ్యాంగులకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగురవేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్రలో కీలక భాగస్వామిగా మారారు. అమలాపురం నియోజకవర్గం నుంచి రాజోలు నియోజకవర్గం వరకు ఫ్లెక్సీలతో నింపేశారు. అంతేకాదు పి.గన్నవరం నియోజకవర్గంలో జాన్ బాబు చేస్తున్న సేవలను సైతం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా అభినందించిన సంగతి తెలిసిందే. ఇకపోతే పెనుమాల జాన్ బాబును పి.గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పలువురు నాయకులు కోరుతున్నారు. అయితే అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని లేకపోతే పవన్ కల్యాణ్ అడుగుజాడల్లో జనసేన పార్టీకి క్రమశిక్షణ కలిగిన నాయకుడిలా పనిచేస్తానని జాన్ బాబు తెలిపారు. దీంతో జనసేన పార్టీ పట్ల జాన్ బాబుకు ఉన్న నిబద్దతను నియోజకవర్గం నేతలు కొనియాడుతున్నారు. ఇకపోతే పొత్తులో భాగంగా గన్నవరం టికెట్ టీడీపీకి ఇస్తారా లేక జనసేనకు ఇస్తారా లేకపోతే బీజేపీకి ఇస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే పవన్ కల్యాణ్ జనసేన జెండా ఎగరాలి అని ఇప్పటికే జనసైనికులకు తెలిపిన నేపథ్యంలో టికెట్ జనసేనకే కేటాయిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ పరిణామాలతో జాన్ బాబు టికెట్ రేసులో ఉండే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed