- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అల్లూరి సీతారామరాజును స్మరించుకున్న పవన్ కళ్యాణ్
దిశ, డైనమిక్ బ్యూరో: వీరులకు పుట్టుకేగాని గిట్టుక ఉండదు. వారి చైతన్యం సదా ప్రసరిస్తూనే ఉంటుంది. వారు రగిల్చిన విప్లవాగ్ని సర్వదా జ్వలిస్తూనే ఉంటుంది. అటువంటి ధీరుడే మన మన్నెం వీరుడు శ్రీ అల్లూరి సీతారామ రాజు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆ మహా యోధుడు వీర మరణం పొంది నేటికీ వందేళ్లు అని.. ఈ పుణ్య తిధినాడు ఆ విప్లవ జ్యోతికి భక్తిపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. కారణజన్ములు తాము చేయవలసిన కార్యాన్ని పూర్తి చేసి అదృశ్యమైపోతారు. దాస్యశృంఖలాలతో అణగారిపోతున్న ప్రజలలో చైతన్యం రగల్చడానికి వచ్చిన సీతారామరాజు, ఆ కార్యం నెరవేర్చి, నవ యువకుడిగానే మహాభినిష్క్రమణం గావించారు అని చెప్పుకొచ్చారు.
సీతారామరాజు మన్యం ప్రజలలో రగిల్చిన విప్లవాగ్ని గురించి తెలుగు నేల నలు చెరగులకూ విదితమేనని చెప్పుకొచ్చారు. నేటి తరం దేశవాసులందరికీ అల్లూరి సీతారామరాజు సంకల్పం.. పోరాట పటిమ.. ధీరత్వం.. మృత్యువుకు వెరవని ధైర్యం.. జ్ఞాన-ఆధ్యాత్మిక సంపదల గురించి తెలియాలి అని వ్యాఖ్యానించారు. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. భారతరత్న ప్రకటించి ఆ పురస్కారానికి మరింత వన్నె అద్దాలి అని డిమాండ్ చేశారు. ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పెద్ద ఎత్తున నిర్వహించాలి. ఆయన స్ఫూర్తిని దేశమంతటికీ చాటాలి. జనసేన అధికారంలోకి వస్తే ఆ బాధ్యతను మేమే స్వీకరిస్తామని.. ఆ చైతన్యమూర్తి వర్ధంతి సందర్భంగా వినమ్రంగా ప్రకటిస్తూ ఆ తేజోమూర్తికి నా పక్షాన, జనసేన పక్షాన అంజలి ఘటిస్తున్నాను అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.