షర్మిలతో కాంగ్రెస్‌కు ప్రయోజనం లేకపోగా నష్టం జరిగే అవకాశముందా?

by GSrikanth |
షర్మిలతో కాంగ్రెస్‌కు ప్రయోజనం లేకపోగా నష్టం జరిగే అవకాశముందా?
X

వరుస విజయాలతో కాంగ్రెస్ శ్రేణులు ఎంతో ఉత్సాహంతో ఉన్నాయి. ఏపీలో కూడా ఉనికిని చాటుకోవడానికి పార్టీ సిద్దమవుతోంది. పీసీసీ రథ సారథిగా వైఎస్​షర్మిలను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే అంశంపై నేడు జరిగే ఏఐసీసీ సమావేశంలో చర్చించనున్నారు. షర్మిలకు పీసీసీ బాధ్యతలు అప్పగించడం సరైనదా.. కాదా అనే అంశంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. జగన్​ తీరు వల్ల వైఎస్సార్​కుటుంబ ప్రతిష్ట మసకబారిందని వారి భావన. షర్మిల వల్ల పార్టీకి మైలేజీ పెరగకున్నా నష్టం వాటిల్లే అవకాశమున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ వైఖరేంటో స్పష్టం కాకుండా కాంగ్రెస్ అధిష్టానం తొందరపడుతుందేమోననే అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల్లో ఏది గెలిచినా.. ఓడినా అన్ని పార్టీల ఎంపీల మద్దతు బీజేపీకేనన్నది జగమెరిగిన సత్యం. అలాంటప్పుడు మూడు పార్టీలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్​పార్టీ విధి విధానాలతో ముందుకు వస్తే ప్రజలు ఆదరించడానికి అవకాశముంది. ఇప్పటిదాకా వైసీపీ పాలనంతా కేంద్రం కనుసన్నల్లోనే నడిచింది. ఎన్డీయే సర్కారు నిర్ణయాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు చేయనంతగా వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ప్రజలపై బలవంతంగా రుద్దింది. విభజన హామీలు అమలు చేయకుండా బీజేపీ ద్రోహం చేసిన పార్టీగా ముద్ర వేసుకుంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ బీ టీములతో తలపడే ఎత్తుగడతో ముందుకొస్తేనే కనీసం కొన్ని సీట్లయినా గెల్చుకునే అవకాశముంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

వైసీపీకి నష్టం లేదు: విజయసాయి..

కాంగ్రెస్​ ఏపీలో అడుగు పెట్టినా వైసీపీకి ఎలాంటి ఢోకా లేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటూ సీటు దక్కని వాళ్లు కొద్దిమంది కాంగ్రెస్​లో చేరినా తమకు వచ్చే నష్టం ఏమీ ఉండదని చెబుతున్నారు. వైసీపీ ఓటర్లను కాంగ్రెస్​ పార్టీ ప్రభావితం చేసే అవకాశమున్నందున తమకు ప్రయోజనం ఉండొచ్చని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్​ పెద్ద ఎత్తున చీలిస్తే టీడీపీ, జనసేనల విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.

హామీలే హస్తం పార్టీకి ప్రాణం పోస్తాయి..

షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించడం వల్ల వైఎస్​ఆకర్షణ తోడవుతుందని కాంగ్రెస్​అధిష్టానం భావిస్తోంది. కానీ, సీఎం జగన్​పాలనా తీరు, వివేకా హత్య ఉదంతంతో వైఎస్సార్​కుటుంబం పేరు ప్రతిష్టలు అడుగంటాయని కాంగ్రెస్​శ్రేణుల నుంచి వినిపిస్తోంది. షర్మిల వల్ల పార్టీకి ఒనగూరే ప్రయోజనం లేకపోగా నష్టం వాటిల్లే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. రాహుల్​ గాంధీ, ప్రియాంక పట్ల దేశంలో వ్యక్తమవుతున్న సానుకూలత రాష్ట్రంలో పార్టీ ఉనికిని నిలబెట్టడానికి దోహదపడుతుందని కాంగ్రెస్​వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్​ ఇచ్చే హామీలు పార్టీకి ప్రాణం పోస్తాయని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

పూర్వవైభవమా? పరాభవమా?

ఇంతకీ టీడీపీ, జనసేనతో బీజేపీ కలుస్తుందా.. లేదా? రానున్న ఎన్నికల్లో వైసీపీకి తెరచాటు నుంచి సహకారం అందిస్తుందా ! తటస్థంగా ఉండి ఒంటరిగా బరిలోకి దిగుతుందా! అనే అంశాల్లో ఇంకా స్పష్టత రాలేదు. బీజేపీ వైఖరిని బట్టి సరైన​ ఎత్తుగడలతో ముందుకెళ్తే రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశాలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ సమావేశంలో ఏపీ గురించి లోతుగా చర్చించనున్నారు. అక్కడ తీసుకునే నిర్ణయాలను బట్టి రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీకి పూర్వ వైభవం వస్తుందా.. లేవలేక చతికిల పడుతుందా అనేది తేలిపోతుంది.

Next Story