నాన్ లోకల్స్: చంద్రబాబు, పవన్‌, బాలకృష్ణ,లోకేశ్‌లపై సీఎం జగన్‌ ధ్వజం

by Seetharam |
నాన్ లోకల్స్: చంద్రబాబు, పవన్‌, బాలకృష్ణ,లోకేశ్‌లపై సీఎం జగన్‌ ధ్వజం
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖం చూస్తే స్కాంలు, అవినీతి, జన్మభూమి కమిటీలు గుర్తుకు వస్తాయని సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. కాకినాడ జిల్లా సామర్లకోటలోని వైఎస్ఆర్ జగనన్న కాలనీల సామూహిక గృహప్రవేశం కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఏనాడైనా నెలరోజులు రాష్ట్రంలో కంటిన్యూగా ఉన్నారా అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా నెల రో జులు నుంచి ఉన్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు, లోకేశ్, దత్తపుత్రుడు, బాలకృష్ణ ఎవరూ మన రాష్ట్రంలో ఉండరని చెప్పుకొచ్చారు. చంద్రబాబు సొంతిళ్లు పక్క రాష్ట్రంలో ఉందని.... దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్‌ అని చెప్పుకొచ్చారు. దత్తపుత్రుడి ఇల్లాలు మాత్రం మూడు నాలుగేళ్లకు మారుతుందని ధ్వజమెత్తారు. ప్యాకేజీ స్టార్‌కు భీమవరంతో, గాజువాకతో సంబంధం లేదు అని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

మన మట్టి, మన మనుషులతో అనుబంధం లేని వ్యక్తులు

చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేశ్, నందమూరి బాలకృష్ణ, ఎల్లో మీడియా వీరందరికీ రాష్ట్రంపైనా... రాష్ట్రప్రజలపైనా ఎలాంటి ప్రేమ లేదని సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. వీళ్లు కావాల్సింది కేవలం అధికారం మాత్రమేనన్నారు. వీళ్లు కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం కోసమే ఒక్కటవుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో దోచుకున్నది పంచుకుంటారన్నారు. వీళ్లంతా మనతోనే చేసేది కేవలం వ్యాపారం మాత్రమేనని ఎద్దేవా చేశారు. మన మట్టి, మన మనుషులతో అనుబంధం లేని వ్యక్తులు వీరు అని విరుచుకుపడ్డారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు కూడా అనలేరు అని జగన్ చెప్పుకొచ్చారు. ప్యాకేజీ స్టార్‌కు మనపై ఎంత ప్రేమ ఉందో కాపులు కూడా ఆలోచించాలి అని సీఎం జగన్ సూచించారు. రాష్ట్రంపై ప్రేమలేని వాళ్లు రాష్ట్రం గురించి ఊగిపోతున్నారు. బాబుకు అధికారం పోతే వీళ్లకు ఫ్యూజులు పోతాయి అని హెచ్చరించారు. పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతుందని కోర్టులకెళ్తారు. ప్రభుత్వం ఎంత మంచి చేసినా మంటలు పెట్టి కుట్రలు చేస్తున్నారు అని ఆరోపించారు. రాజకీయాలంటే విలువు, విశ్వసనీయత ఉండాలి. చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం ఉండాలి. కష్టమొచ్చినా నష్టమొచ్చినా నిలబడేవాడే నాయకుడు అని జగన్ చెప్పుకొచ్చారు. తన ముఖం చూస్తే పేద ప్రజలకు అమలు చేసే స్కీంలు గుర్తుకు వస్తాయని అదే...చంద్రబాబు పేరు చెబితే గజదొంగల ముఠా, పెత్తందారి అహంకారం గుర్తొస్తుందని జగన్ విమర్శించారు. 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేదలకు ఇళ్లు ఎందుకు ఇవ్వలేకపోయారని సీఎం వైఎస్ జగన్ నిలదీశారు. రాష్ట్ర ప్రజల పట్ల బాబుకు ఏం అనుబంధం ఉందని నిలదీశారు. చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో కూడ పేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం చంద్రబాబు చేయలేదని విమర్శించారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో కుప్పంలో ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed