Yuvagalam:పాదయాత్రకు సన్నాహాలు.. జనం స్పందనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి

by sudharani |   ( Updated:2023-01-11 02:20:00.0  )
Yuvagalam:పాదయాత్రకు సన్నాహాలు.. జనం స్పందనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి
X


" ఇప్పటిదాకా నాయకులు చేసిన యాత్రలకు భిన్నంగా నారా లోకేశ్​ పాదయాత్ర ఉంటుంది. రాష్ట్ర ప్రజల దిశ, దశను మార్చేస్తుందని ప్రగాఢంగా నమ్ముతున్నాం. వివిధ వర్గాల ప్రజలు పడుతున్న బాధల గురించి మా నాయకుడు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పన్లేదు. యవ గళానికి స్పందించే జనం గుండె చప్పుడే అన్నీ చెబుతాయి. ప్రజల కష్టాలు, కన్నీళ్లకు పరిష్కారం చూపే దిశలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతుంది. ఇది రాష్ట్ర గతినే మలుపుతిప్పుతుంది..." అని రాజకీయాలను నిశితంగా పరిశీలించే తెలుగు దేశం పార్టీ సానుభూతిపరుడు ఒకరు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. జనవరి 27న కుప్పం నుంచి నారా లోకేశ్ ​ప్రారంభించనున్న పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ దాదాపు రెండు నెలల నుంచి పాదయాత్రపై కసరత్తు చేస్తున్నారు. పలు అంశాలపై నిపుణులతో చర్చిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాటి పరిష్కారాలపై ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. భవిష్యత్​ తరాలకు ఆదర్శవంతమైన పాలన అందించాలంటే ఎలాంటి హామీలు ఇవ్వాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. నానాటికీ తీవ్రమవుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలను తగ్గించడానికి ఏం చేయాలనే దానిపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. మేధావుల సలహాలు తీసుకుంటున్నారు. సంక్షేమం అనేది ప్రభుత్వంపై ఆధారపడేట్లు కాకుండా స్వయంగా ఎదిగేందుకు దోహదపడేలా ఉండాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. వెనుకబడిన, అభివృద్ధి చెందిన జిల్లాల మధ్య అంతరం తగ్గించేందుకు ఏం చేయాలనే దానిపై కూడా నిపుణుల సూచనలు తీసుకుంటున్నారు.

వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి

నేటికీ సగానికిపైగా జనాభాకు వ్యవసాయమే ఆధారం. గ్రామీణ ప్రజల ఉపాధిని పెంచేందుకు ఏం చేయాలనే దానిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గ్రామాల నుంచి వలసలు తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. కీలకమైన వ్యవసాయం, అనుబంధ రంగాలను బలోపేతం చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా కౌల్దారీ చట్టంలో చేయాల్సిన మార్పుల గురించి కుస్తీ పడుతున్నారు. అర్బన్ ​ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య, మౌలిక సదుపాయాల కొరతపై ఎలాంటి విధానాలు రూపొందించాలనే దానిపై మేథావులతో చర్చిస్తున్నారు. యువత ఆత్మ గౌరవంతో తలెత్తుకొని జీవించేలా చేయడానికి తగిన ఉపాధి కల్పించాలనే దానిపై నిపుణుల సూచనలు తీసుకుంటున్నారు. ప్రజలందరికీ ఒకే స్థాయి విద్య, వైద్యం ఉచితంగా అందించడానికి అవసరమైన ప్రణాళికలపై కూడా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

కొనుగోలు శక్తి పెంచేలా

మొదటి విడత కరోనా సమయం నుంచి నేటిదాకా దేశ వ్యాప్తంగా 7.80 లక్షల పరిశ్రమలు మూత పడ్డాయి. కేంద్రం ప్రకటించిన రిలీఫ్ ​ప్యాకేజీ రూ.20 లక్షల కోట్లు పరిశ్రమలను తిరిగి కోలుకునేట్లు చేయలేకపోయాయి. కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం ద్వారా మునుపటి స్థితికి చేరవచ్చని భావించింది. అసలు లోపం ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమని గుర్తించలేదు. అందువల్ల రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే పరిశ్రమలు వస్తాయి. రాయితీలతో కాదనే వాస్తవాన్ని లోకేష్​ గ్రహించినట్లున్నారు. అందుకనుగుణంగా పారిశ్రామిక వృద్ధికి ప్రణాళికలను ప్రకటించడానికి సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం.

ఎడాపెడా భారాలు మోపారు

వైఎస్​ రాజశేఖర ​రెడ్డి పాదయాత్ర నాటికి ప్రజలకు విద్య, వైద్యం భారమైనట్లు ప్రజలు నివేదించారు. సాగునీటి ప్రాజెక్టుల్లేక కరవు కాటకాలతో వ్యవసాయం దెబ్బతిన్నట్లు గుర్తించారు. అందుకు అనుగుణంగా వైఎస్​ పాలనలో విధానాలను అమలు చేశారు. వైఎస్ ​జగన్​ పాదయాత్ర చేపట్టే నాటికి నిరుద్యోగం పెను భూతంలా మారింది. విద్య, వైద్యం తలకు మించిన భారమైంది. నిజ వేతనాలు పడిపోయాయి. ఆదాయాలకు, వ్యయానికి పొంతన లేకుండా పోయింది. కేంద్రం విధించే భారాలు సగటు ప్రజలను మరింత పేదరికంలోకి నెట్టేశాయి. జగన్​ అధికారానికి వచ్చాక వీటన్నింటి పరిష్కారం కోసం పాలనలో సంస్కరణలు తీసుకొచ్చారు. నవరత్నాలు అమలు చేస్తున్నారు. అవి ప్రజల ఆకాంక్షల మేరకు లేకపోగా కేంద్ర సర్కారుతో కలిసి ఎడాపెడా భారాలు మోపడం ఎక్కువైంది. దీంతో అన్ని వర్గాల్లో మరింత ఆక్రోశం పెరిగింది. ఈ సమయంలో నారా లోకేశ్ ​యువ గళం పేరుతో పాదయాత్రకు సిద్దమవుతున్నారు. ప్రజలు ఏ మేరకు ఆయన్ని ఆదరిస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story

Most Viewed