అమరావతి నిర్మాణం చేతగాకే జగన్ రెడ్డి కుట్రలు: నక్కా ఆనంద్ బాబు

by Seetharam |
అమరావతి నిర్మాణం చేతగాకే జగన్ రెడ్డి కుట్రలు: నక్కా ఆనంద్ బాబు
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిగా అమరావతిని స్వాగతించిన జగన్ రెడ్డి, అధికారం దక్కగానే ఎక్కడలేని అక్కసు వెళ్లగక్కుతూ, ఆప్రాంత రైతులపై విద్వేషంతో వ్యవహరిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ఆరోపించారు. 6నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తిచేయాలన్న హైకోర్టు ఆదేశాలను పెడచెవినపెట్టి, తనకులేని అధికారం హక్కులకోసం పాకులాడుతున్నాడంటూ మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్రకార్యాలయంలో నక్కా ఆనందబాబు మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని, కోర్టు తీర్పులను లెక్కచేయకుండా, అమరావతిపై, ఆప్రాంత రైతులపై జగన్ రెడ్డి విధ్వంసరచన చేస్తున్నాడని ఆరోపించారు.

అమరావతి రైతుల పాదయాత్రను చూసి ఓర్వలేకే జగన్ రెడ్డి వికేంద్రీకరణ నినాదం ఆలపిస్తున్నాడని విరుచుకుపడ్డారు. వికేంద్రీకరణ ఊసెత్తడానికి ముఖ్యమంత్రికి, మంత్రులకు సిగ్గుందా? అని ప్రశ్నించారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఎన్టీఆర్ మండల వ్యవస్థను తెస్తే జగన్ ప్రభుత్వం దాన్ని విచ్ఛిన్నం చేసింది అని విమర్శించారు. రాజధాని మార్చే అధికారం తనకు లేదని జగన్ రెడ్డికి తెలియదా? ఆ అధికారం లేదని ఒప్పుకుంటూ విజయసాయిరెడ్డి ప్రైవేట్ బిల్లు తీసుకొచ్చింది వాస్తవంకాదా ? అని నిలదీశారు. ఏపీలో రాజధానుల ఏర్పాటుపై రాష్ట్రశాసనసభకు విస్పష్టమైన అధికారం ఉండేలా రాజ్యంగ సవరణ చేయాలంటూ విజయసాయిరెడ్డి, పార్లమెంటులో బిల్లుపెట్టడం ముమ్మాటికీ దుర్మార్గమేనని మండిపడ్డారు. మార్చి3న హైకోర్ట్ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో రాజధాని మార్చే అధికారం శాసనసభకు లేదని చెప్పిన విషయం ముఖ్యమంత్రికి తెలియదా అంటూ ధ్వజమెత్తారు.

హైకోర్టు ఆదేశాలప్రకారం 6నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తిచేయడం చేతగాకనే జగన్ రెడ్డి, అమరావతిపై సుప్రీంకోర్టుకి వెళ్లాడు. కోర్టు తీర్పులకు విరుద్ధంగా తనకులేని హక్కులు, అధికారం కోసం జగన్ రెడ్డి ప్రాకులాడుతున్నాడు. చీటింగ్ ముఠాల సాయంతో ఒకలయర్ (అబద్ధాలకోరు) రాష్ట్ట్రాన్ని పరిపాలిస్తున్నాడని ఇప్పటికే ప్రజలు వాపోతున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రజాభిప్రాయసేకరణ జరిపితే, 52శాతంప్రజలు అమరావతికి మద్ధతుపలికారు. ఇదే విషయాన్ని శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో పేర్కొన్నది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు గుర్తు చేశారు.

పారిశుధ్య పనులు చేయలేని దుస్థితిలో జగన్ సర్కార్

పంచాయతీల్లో పారిశుధ్యపనులు చేయలేని దుస్థితిలో ఉన్న జగన్ ప్రభుత్వం.. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తుందా? అని ఆనందబాబు ప్రశ్నించారు. జగన్ రెడ్డి దృష్టిలో అభివృద్ధి వికేంద్రీకరణ అంటే స్థానిక సంస్థలను నిర్వీర్యంచేసి, సర్చంచ్‌లు, మేయర్లను ఉత్సవ విగ్రహాలను చేయడమా? అని నిలదీశారు. 14, 15 ఆర్థిక సంఘాల నుంచి పంచాయతీల అభివృద్ధికోసం కేటాయించిన రూ.12వేల కోట్ల సొమ్ముని దిగమింగిన జగన్ రెడ్డి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిచేస్తాడని ప్రజలంతా నిలదీస్తున్నారని అన్నారు.

నాడు రాజధానిగా అమరావతి ఏర్పాటుని ప్రతిపక్షనేతగా స్వాగతించిన జగన్ రెడ్డి, ఇప్పుడు మాటమార్చి, మడమ తిప్పడమేనా అభివృద్ధి వికేంద్రీకరణ? అని నిలదీశారు. మూడున్నరేళ్ల తన పాలనలో విశాఖపట్నంలో జగన్ రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యం. అసలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో, విశాఖలో అభివృద్ధి జరిగిందంటే అది చంద్రబాబు హాయాంలోనే. అసలు అభివృద్ధి అనే పదానికి రోల్ మోడల్ చంద్రబాబు. ఆయన పాలనను అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి. హైదరాబాద్ లో నిర్మాణం జరిగిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొదలు విభజనానంతరం నవ్యాంధ్రప్రదేశ్ లోని 13జిల్లాల్లో అభివృద్ధిని వేగవంతం చేసింది చంద్రబాబు అని చెప్పుకొచ్చారు. విశాఖను ఐటీకేంద్రంగా తీర్చిదిద్దడమేగాక, ఎన్నోజాతీయ, అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థలను అక్కడికి తీసుకొచ్చారు అని చెప్పుకొచ్చారు.

ఐ.ఐ.ఎమ్, పెట్రోలియం యూనివర్శిటీ, మెడ్ టెక్ జోన్, 2లక్షల చదరపు అడుగుల్లో మిలీనియం టవర్స్, క్లౌడ్ సిటీ ఏర్పాటుతోపాటు, 3సార్లు సీఐఐసమ్మిట్ ల నిర్వహించి సాగరనగరాన్ని ప్రపంచపటంలో నిలబెట్టిన ఘనత చంద్రబాబుది, టీడీపీప్రభుత్వానిది అని చెప్పుకొచ్చారు. ఈ విధంగా చెప్పుకోవడానికి జగన్ రెడ్డి విశాఖలో ఏమైనా చేశాడా? తన దోపిడీకి, భూములకబ్జాకు జగన్ రెడ్డి విశాఖను అడ్డాగా మార్చాడు. టీడీపీ హాయాంలో ఏజెన్సీప్రాంతంలో కాఫీతోటలుసాగుచేస్తే, జగన్ రెడ్డి వచ్చాక గంజాయిసాగుతో రాష్ట్రంపరువు తీశాడు అని ధ్వజమెత్తారు.

స్వప్రయోజనాలకోసం నాలుకమడతేస్తున్న మంత్రులంతా రాజకీయవ్యభిచారులే..

ముఖ్యమంత్రి దుర్మార్గపు ఆలోచనలను సమర్థిస్తూ, కేబినెట్ మంత్రులు వ్యవహరించడం సిగ్గుచేటు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. అమరావతి రైతుల్ని ఉత్తరాంధ్రప్రాంతంలో అడుగుపెట్టనీయమని మంత్రులు మాట్లాడటం నిజంగా క్షమించరానినేరం అని అభిప్రాయపడ్డారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్లు నరంలేని నాలుకతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇదే ధర్మాన జగన్ రెడ్డిని అనని మాటలులేవు. 'జగన్ పత్రికలో అన్నీ అబద్ధాలేనని, జగన్ పత్రిక ఒక కరపత్రమని, జగన్ పదవీదాహానికి అంతులేదని' ఇష్టమొచ్చినట్లు తిట్టాడు.

అలాంటి ధర్మాన ఇప్పుడు తన నాలుక మడతేసి సిగ్గులేకుండా ఉత్తరాంధ్రను ఉద్ధరించేవాడిలా మాట్లాడుతున్నాడు. బొత్స సత్యనారాయణ అయితే ఏకంగా వైఎస్ మరణం వెనుక, జగన్ హస్తమే ఉందని గతంలో ఒక సందర్భంలో మాట్లాడాడు. జగన్ అవినీతిపై బొత్స స్పందిస్తూ, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా దక్కాల్సింది దక్కుతుందిలే అని చెప్పలేదా? ఎవరు వడ్డించారో సీబీఐ తేలుస్తుందని అనలేదా? ఏరోటికాడ ఆ పాటపాడుతూ, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే నిజంగా వారంతా రాజకీయ వ్యభిచారులే. జగన్ రెడ్డికి, ఇలాంటి పనికిమాలిన మంత్రులకు ఎందుకు అధికారం ఇచ్చామా అని ప్రజలంతా లెంపలేసుకుంటున్నారు.

కిరాయిమూకలతో అమరావతి రైతుల్ని అడ్డుకొని, వారినేదో చేయాలనే దుష్టఆలోచనలో ఈప్రభుత్వం, జగన్ రెడ్డి ఉన్నారు. విశాఖ వాసులకు జగన్ రెడ్డి పొడ, వాసన గిట్టదు. ప్రశాంతమైన వాతావరణాన్ని అక్కడివారు ఇష్టపడతారు కాబట్టే, గతంలో విజయమ్మను ఓడించారు. జగన్ రెడ్డి కొత్తగా విశాఖను రాజధాని చేయాల్సిన పనేంలేదు. భారతదేశంలో అభివృద్ధి చెందిన నగరాల జాబితాలో విశాఖపట్నం ఎప్పుడూఉంటుంది. రాజ్యాంగాన్ని, కోర్టు తీర్పులు ధిక్కరిస్తూ, అమరావతిపై, ఆప్రాంత రైతులపై విషం చిమ్ముతున్న వారికి త్వరలోనే తగినవిధంగా ప్రజలు బుద్ధిచెబుతారు. జగన్ రెడ్డి ఇప్పటికైనా తన విధ్వంసరచనకు స్వస్తి చెప్పకపోతే, ఏపీప్రజలు ఆయనకు సమాధికట్టడం ఖాయం" అని ఆనంద్ బాబు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed