అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ? ఆ నేత కొడుకు ఆశలు ఆవిరి

by Rajesh |
అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ? ఆ నేత కొడుకు ఆశలు ఆవిరి
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా జనసేనాని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తున్నారనే సంకేతాలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు తనయుడు, తెలుగుదేశం ఐటీ విభాగం కన్వీనర్ విజయ్ ఈ సీటును ఆశించారు. లోకేశ్ మద్దతుతో గుంటూరు జిల్లాకు చెందిన బైరా దిలీప్ చక్రవర్తి సీటుపై ఆశతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

వీరిద్దరి ఆశలకు గండి కొడుతూ నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. మాజీ మంత్రి అయ్యన్న పలు మార్లు తన కుమారుడు విజయ్ ఉన్నత విద్యాభ్యాసం చేశారని, ఇప్పటికే పదేళ్లుగా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారని, అనకాపల్లి పార్లమెంటుకు తగిన వ్యక్తి అనే అభిప్రాయం కలిగించారు. దరఖాస్తు కూడా చేశామని, చంద్రబాబు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు విలేకరుల సమావేశంలో చెబుతూ వచ్చారు. తాజాగా చంద్రబాబు మాడుగుల నియోజకవర్గంలో నిర్వహించిన రా.. కదలిరా సభలో నేరుగా ఆయన ముందే తన కుమారుడు విజయ్ పార్లమెంటు సీటు ప్రస్తావన తీసుకువచ్చి బహిరంగంగానే చంద్రబాబుకు విన్నవించారు.

నియోజకవర్గంలో నాగబాబు పర్యటనలు

ఇదే సమయంలో జనసేనకు తిరుపతి పార్లమెంటు ఇస్తే, అనకాపల్లి టీడీపీకి ఇచ్చేయడానికి, అదే తిరుపతి టీడీపీ తీసుకుంటే అనకాపల్లి జనసేనకు అడగడానికి నిర్ణయించుకున్నట్టు తెలిసింది. తాజాగా ఈ సీటు నుంచి నాగబాబు పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇందు కోసం ఆయన రెండు రోజుల క్రితం విశాఖపట్నం వచ్చారు. పది రోజులపాటు ఇక్కడే ఉండి అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షలు నిర్వహించనున్నారు.

బుధవారం అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని పాయకరావు పేటలో సమీక్ష నిర్వహించిన నాగబాబు.. గురువారం పెందుర్తిలో జరిగిన సమీక్షకు హాజరయ్యారు. రోజుకో నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దీన్ని బట్టి ఆయనే ఇక్కడి అభ్యర్థి అనే వాదనకు బలం చేకూరింది. ఇదే స్థానంలో 2009లో ప్రజారాజ్యం నుంచి చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ పోటీ చేసి ఓడిపోయారు. జనసేన నుంచి ఈ స్థానంపై ఆశలు పెట్టుకొన్న సీనియర్ నేత కొణతాల రామకృష్ణకు ఈ పరిణామం ఇబ్బందికరమే. నాగబాబు అనకాపల్లి లో ఉంటే అక్కడి నుంచే రాజకీయం చేసే కొణతాలకు స్వేచ్ఛ ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

Advertisement

Next Story