ములాఖత్ మతలబు: పవన్ కల్యాణ్‌తో భేటీపై చంద్రబాబుతో లోకేశ్ చర్చ

by Seetharam |   ( Updated:2023-10-23 13:52:18.0  )
ములాఖత్ మతలబు: పవన్ కల్యాణ్‌తో భేటీపై చంద్రబాబుతో లోకేశ్ చర్చ
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వివరించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో తండ్రి చంద్రబాబుతో నారా లోకేశ్, నారా బ్రాహ్మణిలు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను నారా లోకేశ్‌ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా జనసేన పార్టీతో సమన్వయ కమిటీ సమావేశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆ సమావేశంలో ఏయే అంశాలపై చర్చించాలనేదానిపై లోకేశ్‌కు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలలో సాగునీటి కొరతతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. కరవు, కృష్ణా జలాల పంపిణీ పునఃసమీక్షతో పాటు వివిధ ప్రజా సమస్యలపై చర్చిస్తున్నట్లు లోకేశ్‌ వివరించారు. నిత్యావసర ధరలు, విద్యుత్‌ ఛార్జీల పెంపు వంటి అంశాలపైనా దృష్టి సారించాలని లోకేశ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖపైనా వైసీపీ రాజకీయం చేస్తోందని లోకేశ్ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. 45 నిమిషాలపాటు చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అయిన లోకేశ్ అనంతరం ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.

ధైర్యంగానే చంద్రబాబు

లోకేశ్‌ చర్చించిన అంశాలపై మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప మీడియాకు వెల్లడించారు. సెంట్రల్ జైలులో చంద్రబాబు ధైర్యంగానే ఉన్నారని తెలిపారు. అయితే చంద్రబాబు ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగా ఉందని లోకేశ్ తెలిపారని చినరాజప్ప పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు బయటకు వస్తారా అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు. దసరా సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు చంద్రబాబు నాయుడు విడుదల కోరుతూ ప్రత్యేక పూజలు చేశారని అన్నారు. ఇకపోతే జగన్‌ ఆరాచక పాలన అంతమే లక్ష్యంగా టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోరాటం చేస్తాయని మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప వెల్లడించారు. ఇరు పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో ఉమ్మడి కార్యచరణపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed