ఓటర్ జాబితా తప్పులతడక: పేరు మహిళది..ఫోటో వైఎస్ జగన్‌ది

by Seetharam |
ys jagan
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో ఓటర్ జాబితా విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఓటర్ జాబితాలో అక్రమాలపై ఈనెల 8న టీడీపీ బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని సైతం కలవనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓటర్ జాబితాలో అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. ప్రతిపక్షాల ఆరోపణలకు ఊతమిచ్చేలా ఓటర్ జాబితాలో తప్పులు బయటపడ్డాయి. ప్రకాశం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓటర్ జాబితాలో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొటో ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. అది కూడా ఓ మహిళ ఫొటో ఉండాల్సిన చోట సీఎం జగన్ ఫొటో ఉండటం విమర్శలకు దారి తీస్తోంది. పేరు మహిళది ఫోటో జెంట్స్ ది అందులోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ది అని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలింగ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఓటర్ జాబితాలో సవరణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని చెర్లోపల్లి గ్రామ ఓటర్ జాబితాలో సీఎం వైఎస్ జగన్ ఫోటో కనిపించింది. చెర్లోపల్లి గ్రామానికి చెందిన గురవమ్మ అనే మహిళ ఓటు నమోదు అయి ఉంది. ఆమె ఫొటో ఉండాల్సిన స్థానంలో సీఎం వైఎస్ జగన్ ఫోటో ప్రత్యక్షమైంది. అయితే బీఎల్ వో లో కంప్యూటర్ ఆపరేటర్ నిర్లక్ష్యంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఓటర్ జాబితాను సిద్ధం చేశాక ప్రింటింగ్‌కు ఇచ్చే ముందు బీఎల్‌వో తో పాటు రెవెన్యూ అధికారులు కూడా తనిఖీ చేస్తారు. అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇంతలా నిర్లక్ష్యమా అంటూ ప్రతీ ఒక్కరూ ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed