బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో 24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు

by Jakkula Mamatha |
బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో 24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రాన్ని వర్షాలు వీడడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు అరేబియా సముద్రంలోని అల్ప పీడన ప్రాంతం నుంచి ఉపరితల ద్రోణి దక్షిణ కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర తీరం వరకు వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో ఏపీలో నిన్న(శనివారం) పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.

ఈ క్రమంలో తాజాగా రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోందని ఇది మరో రెండు రోజుల్లో వాయుగుండంగా మారే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 21న ఉత్తర అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. ఈ అల్పపీడనం ఈనెల 23 నాటికి తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. ఈనెల 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో, పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Next Story