Atrocious: చనిపోయిన భర్తకు ఇంట్లోనే అంత్యక్రియలు

by srinivas |
Atrocious: చనిపోయిన భర్తకు ఇంట్లోనే అంత్యక్రియలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇద్దరు కుమారులకు జన్మనిచ్చారు. ఇద్దరి భవిష్యత్‌కు బంగారు బాటలు వేశారు. చివరి రోజుల్లో తమకు ఆసరాగా ఉంటారనుకున్న ఆ తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. తండ్రి మంచానపడినా పట్టించుకోవడం లేదు. దీంతో భార్యే అన్నీ తానై భర్తను సాకుతుంది. కొడుకులు తండ్రి కోసం ఆరాటం కన్నా ఆస్తుల కోసమే ఎక్కువ ధ్యాస అని తల్లి విలపిస్తోంది. ఇలాంటి సమయంలో భర్త మరణించారు. తండ్రి మరణించాడని తెలిస్తే కొడుకులు వచ్చి ఎక్కడ ఆస్తులు పంచమంటారోనన్న భయంతో ఆ తల్లి తన భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించింది. కొడుకులు కోసం భయపడి ఇంట్లోనే అట్టపెట్టెలతో భర్త మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ విషాదఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.

కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి చెందిన పోతుగంటి హరికృష్ణ ప్రసాద్(60), లలిత దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు దినేశ్ కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తుండగా.. చిన్న కుమారుడు కెనడాలో స్థిరపడ్డారు. అయితే ఈ వృద్ధ దంపతులు ఇంటివద్దే మెడికల్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే హరికృష్ణ ప్రసాద్ కొంతకాలంగా అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఇంట్లో మంచానికే పరిమితమయ్యారు. ఉన్నట్లుండి సోమవారం హరికృష్ణ ప్రసాద్ ఇంటి నుంచి పొగలు రావడాన్ని కాలనీ వాసులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పత్తికొండ ఎస్ఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి ఇంట్లో ఉన్న లలితను విచారించారు. ఆమె చెప్పిన సమాధానం విని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. భర్త మృతదేహానికి ఇంట్లోనే దహన సంస్కారాలు చేసినట్లు తెలుసుకుని అవాక్కయ్యారు. తండ్రి చనిపోయాడని తెలిస్తే కొడుకులు ఆస్తి కోసం గొడవ చేస్తారనే భయంతో ఇంట్లోనే భర్తకు అంతిమ సంస్కరాలు చేసినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. కొడుకులు ఇద్దరూ తమను పట్టించుకోవడంలేదని..ఆస్తి కోసం తరచూ గొడవపడుతున్నారని పోలీసులకు తెలిపింది. తండ్రి చనిపోయిన విషయం తెలిస్తే ఆస్తి కోసం గొడవ చేస్తారన్న భయంతో.. ఇంట్లోనే అట్టపెట్టెలతో భర్త దహన సంస్కారాలు చేశానని లలిత పోలీసులకు తెలిపింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు హరికృష్ణ ప్రసాద్ కొంతకాలంగా అనారోగ్యానికి గురైన మాట వాస్తవమేనని స్థానికులు చెబుతున్నారు. భర్తను కంటికి రెప్పలా లలిత కాపాడుకుంటూ సేవలు చేస్తోందని వెల్లడించారు. అయితే హరికృష్ణప్రసాద్‌కు సేవలు చేయలేకే అతడిని బతికుండగానే నిప్పు పెట్టి దహనం చేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే లలిత మాత్రం తన భర్త గుండెపోటుతో సోమవారం ఉదయం కన్నుమూశాడని చెప్తోంది. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed