తీగల వంతెనకు బ్రేక్?

by srinivas |   ( Updated:2024-07-23 17:01:18.0  )
తీగల వంతెనకు బ్రేక్?
X

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిద్దేశ్వరం-సోమశిల వద్ద నిర్మించనున్న తీగల వంతెన ప్రాజెక్టుకు బ్రేకులు పడనున్నట్లు తెలిసింది. బ్రిడ్జీ కమ్ బ్యారేజీ కాకుండా సిద్దేశ్వరం అలుగు నిర్మాణానికి మొగ్గు చూపుతుందని సమాచారం.

దిశ ప్రతినిధి, కర్నూలు: సింగోటం జాతర సమయంలో నాటు పడవలో కృష్ణా నదిని దాటుతూ 61 మంది మృతి చెందారు. దీంతో నదిపై వంతెన నిర్మాణం చేయాలనే డిమాండ్లు అప్పట్లో వినిపించాయి. అది కార్యరూపం దాల్చేందుకు 17 ఏళ్లు పట్టగా కొందరు వాటి స్థానంలో అలుగు నిర్మాణానికి గళమెత్తారు. ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందోనన్న సందేహంలో సీమవాసులున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణానదిపై భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా రూ.1200 కోట్లతో తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ర్టంలోని కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల బైపాస్ రోడ్డు వరకు 174 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణానికి పూనుకుంది.

ఇప్పటికే తెలంగాణలో కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు హైవే పనులు కొనసాగుతున్నాయి. సంగమేశ్వరం నుంచి ఆత్మకూరు, అక్కడి నుంచి నంద్యాల వరకు పనులు చేపట్టాల్సి ఉంది. వీటి నిర్మాణాలకుగానూ కేంద్రం నిధులు విడుదల చేసింది. కానీ ఇంకా పనులు ప్రారంభించలేదు. ఇక్కడ సాధారణ వంతెన కాకుండా పర్యాటక ఆకర్షణగా ఐకానిక్ వంతెన నిర్మించాలని నిర్ణయించారు. ఈ వంతెనను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ నేటికీ తీగెల వంతెన పనులు ప్రారంభించలేదు.

తెరపైకి సిద్దేశ్వరం అలుగు

2007లో పుట్టి ప్రమాదం తర్వాత 17 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత కేంద్రం తీగల వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కానీ, గతేడాది మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి బ్రిడ్జీ కమ్ బ్యారేజీ నిర్మించాలని, తద్వారా 70 టీఎంసీల నీటిని నిల్వ చేస్తే రాయలసీమ జిల్లాలకు సాగు, తాగు నీటి ఇబ్బందులుండవని కోరుతూ నిరసన గళం వినిపించారు. నాలుగు రోజులక్రితం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి మదనపల్లె పర్యటనలో భాగంగా తిరుపతి విమానాశ్రయంలో ఉండగా, ఎంపీ డాక్టర్ గురుమూర్తి ద్వారా రాయలసీమ మేధావుల ఫోరం కేంద్ర మంత్రికి సిద్దేశ్వరం అలుగు ప్రాధాన్యత గురించి వివరించారు. దీనిపై సాధ్య సాధ్యాలను పరిశీలించాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించడంతో అలుగు నిర్మాణంపై ఆశలు పెరిగాయి.

Read More..

Real Scam: గుంటూరులో రియల్ బూమ్ బూమ్

Advertisement

Next Story